పవన్ మాటలపై వెంకయ్య రియాక్ట్ కారట

Update: 2016-09-02 16:56 GMT
ఏడు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ సర్కారును.. బీజేపీ నేతల్ని ఉతికి ఆరేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి తెలుగు ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి పేరును ప్రస్తావించి మరీ సూటిగా విమర్శించారు. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉందంటూ వెంకయ్యా మాటల్నికోట్ చేస్తూ.. ‘‘మీరు తప్పు చేస్తున్నారు’’ అని తేల్చేయటమే కాదు.. ‘‘పార్టీ ప్రయోజనాల కంటే.. వ్యక్తి ప్రయోజనాల కంటే.. జాతి ప్రయోజనాలు ముఖ్యం.. అర్థం చేసుకోండి’’ అంటూ ఎంతమాట అనాలో అంత మాట అనేశారు. తిట్టటం తప్పించి.. దాదాపుగా తిట్టినంత పని చేశారు. విభజన బిల్లు సమయంలో ఇదే వెంకయ్య చెప్పిన.. ‘‘ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు ఉండాలని వెంకయ్యానాయుడు చెప్పారు’’ అంటూ పాత విషయాల్ని గుర్తు చేశారు.

తననింత సూటిగా విమర్శించిన పవన్ కల్యాణ్ మీద వెంకయ్య రియాక్షన్ ఏమిటి? ఆయనెలా స్పందించారు? పవన్ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్ చేశారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే కాసింత ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఏపీ ఎంపీలపై విమర్శలు చేస్తే.. ఒక్కొక్కరు ఎంతలా విరుచుకుపడారో తెలిసిందే. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అని అననట్లుగా ఒకట్రెండు చిన్న విమర్శలు చేసిన దానికే బాబు ఎంతలా గింజుకున్నారో తెలిసిందే. అలాంటి మోడీ సర్కారులో కీలకభూమిక పోషించిన వెంకయ్య ఇంకెంతలా మండిపడాలి?

కానీ.. అలాంటిదేమీ లేకుండా జాగ్రత్త పడ్డారు వెంకయ్య. చెన్నైలో జరుగుతున్న తిరంగా యాత్రలో పాల్గొన్న ఆయన.. పవన్ కల్యాణ్ చేసిన విమర్శల్ని ప్రశ్నిస్తే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించనని చెప్పటం గమనార్హం. ప్రత్యేక హోదాకు మించిన సాయం ఆంధ్రప్రదేశ్ కు అందించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లుగా చెప్పిన వెంకయ్య..ప్రత్యేకహోదా మీద మారిన తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అంటూ నినాదాలు చేస్తున్నారని.. దాని వల్ల కలిగే ప్రయోజనం ఏ పాటిదన్న విషయం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు వెళ్లి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. మరి.. అదే నిజమైతే.. ఐదేళ్లు కాదు.. పదిహేనేళ్లు అన్న మాటను వెంకయ్య గతంలో ఎందుకు చెప్పినట్లు? ఆ సూటి ప్రశ్నకు వెంకయ్య సమాధానం చెప్పరేం? పవన్ కల్యాణ్  అన్నారంటారు కానీ.. నరం లేని నాలుకతో ఇష్టారాజ్యంగా అంటుంటే.. విమర్శలతో కడిగేయటంలో తప్పు లేదు కదా?

Tags:    

Similar News