నిజంగానే.. వెంకయ్యనాయుడు మొనగాడండీ

Update: 2016-09-11 11:30 GMT
తప్పు చేసి కూడా పొగిడించుకోవటం.. సానుకూలంగా మాట్లాడించుకోవటం రాజకీయ నేతలకు అంత సులువైన వ్యవహారం కాదు. మహా అయితే.. సొంత పార్టీ వారు వెనకేసుకొస్తారు. కానీ.. సొంతపార్టీలే కాదు.. మిత్రపక్షానికి చెందిన నేతలు మొదలు ప్రముఖ మీడియా సంస్థకు సంబంధించిన వారు సైతం మద్దతు ఇస్తూ మాట్లాడటం.. వీరుడు.. శూరుడు.. ఆయనే కానీ ఆ రోజు ఆదుకోకపోతే ఏం జరిగేదో తెలుసా? అంటూ మాటలు చెప్పించుకోవటం అంత సులువైన విషయం కాదు. కానీ.. దాన్నిసాధ్యం చేయగలిగారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

ఏపీ విభజన సమయంలో పార్లమెంటులో ఏపీ తరఫున గళం విప్పింది వెంకయ్యనాయుడు మాత్రమేనని. .ఆయన కానీ ఆ రోజున గళం విప్పక పోతే ఏపీ గురించి ఈ రోజు మాట్లాడేవారంతా ఏం మాట్లాడేవారంటూ వెంకయ్యను అభిమానించి.. ఆరాధించే వారంతా గళం విప్పుతున్నారు. స్నేహానికి విలువనిచ్చే వెంకయ్యను వెనుకేసుకురావాల్సిన సమయం వచ్చిన విషయాన్ని గుర్తించిన ఆయన వర్గం ఇప్పుడు వెంకయ్యకు రక్షణ కవచంలా నిలుస్తున్నారనటంలో సందేహం లేదు. అందుకు.. తమ మేధను వాడేస్తున్న వారు.. మాటలతోనూ.. అక్షరాలతోనూ సీమాంధ్రుల్ని కన్ ఫ్యూజన్ కు గురి చేస్తున్నారు.

ఏపీ హోదా అంశాన్ని నాటి ప్రధాని మన్మోహన్ ఐదేళ్లు అన్న వెంటనే.. కాదు పదేళ్లు అంటూ మాట్లాడిన వెంకయ్య.. అధికారంలోకి వచ్చాక మాత్రం మోడీ మాటతో ఏపీకి హోదా సాధ్యం కాదని తేల్చేశారు. సరే.. సాధ్యం కాదనే అనుకుందాం. ఎందుకు కాదు? కారణాలు ఏమిటన్నది జనాలకు అర్థమయ్యేలా చెప్పాలిగా. అలాంటిదేమీ లేకుండా తమకు ఏ టైంలో ఏం అనిపిస్తే అది చెప్పేసి.. ఆ తర్వాత అలా ఎలా? అని అడిగితే.. మమ్మేల్నే నిలదీస్తావా? అన్నట్లుగా ప్రశ్నించటం వెంకయ్య వర్గానికే చెల్లింది.

హోదా రాదనే విషయాన్ని తేల్చేసిన నేపథ్యంలో అందరి దృష్టి వెంకయ్య మీదనే పడింది. చాలామంది మోడీని ఎందుకు నిందించటం లేదని అడుగుతున్నారు. మోడీకి ఏపీ విషయం ఎంత తెలుసన్నది సందేహమే. కానీ.. వెంకయ్యకు అలాంటి పరిస్థితి లేదు. అందులోకి తాను పుట్టి పెరిగిన రాష్ట్రమ్మీద మమకారం ఎంతోకొంత ఉంటుందన్న భావనతో పాటు.. మోడీకి జిగిరీ దోస్తానా ఉందని చెబుతుంటారు. కేంద్రంలో ఆయనకున్న పలుకుబడి అంతాఇంతా కాదంటూ గొప్పలు చెప్పుకునే  నేపథ్యంలో.. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఒప్పుకుంటున్నావ్? అంటూ నిలదీయటం తప్పేం కాదు.

కానీ.. వెంకయ్యకు సన్నిహితంగా ఉండే వర్గం (వీరిలోరాజకీయ నేతలు.. మీడియా అధిపతులు సహా చాలామందే ఉన్నారు సుమా) జరుగుతున్న పరిణామాల మీద తీవ్ర అసంతృప్తితో ఉంది. తమకు సన్నిహితుడైన వెంకయ్య ఇమేజ్ డ్యామేజ్ అయితే.. తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారు వెంకయ్య తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడటం మొదలెట్టారు. ప్రజల సెంటిమెంట్ విషయాన్ని వదిలేసి మరీ.. బరి తెగించినట్లుగా మాట్లాడటం.. తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న ఆశ ఎవరికీ లేదు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ సైతం.. తన లైఫ్ టైంలో కాకున్నా.. తర్వాతి తరంలో అయినా తన ఆకాంక్ష నెరవేరుతుందన్న భావనను తన సన్నిహితుల వద్ద ఆయన వ్యక్తం చేసేశారు. అయినప్పటికీ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉదాత్తంగా ప్రచారం చేసిన వారు.. ఇప్పుడు ఏపీ ప్రజలు చేస్తున్న హోదా అంశంపై మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం విషయంలో ప్రజల వాదనను వినిపించిన వారంతా.. హోదా అంశంలో సీమాంధ్రుల వాదన కంటే కూడా తమకు సన్నిహితులైన వారి వాదనను వినిపించేందుకు.. ప్రజల్ని నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తే అనిపించేది ఒక్కటే.. వెంకయ్యనాయుడు మొనగాడండీ అని.
Tags:    

Similar News