వెంక‌య్య కేంద్ర మంత్రా... ఏపీ మంత్రా..!

Update: 2016-11-05 10:10 GMT
ఎందుకీ సందేహం అని అంటున్నారా? అక్క‌డికే వ‌చ్చేద్దాం. కేంద్ర మంత్రిగా ఉండాల్సిన నెల్లూరు బీజేపీ నేత వెంక‌య్య నాయుడు నోరు విప్పినా.. కాలు క‌దిపినా ఏపీ గురించి - ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించే మాట్లాడ‌తారు. సో.. అందుకే ఆయ‌న అస‌లు కేంద్ర మంత్రేనా?  లేక ఏపీ మంత్రా? అన్న సందేహం వ‌చ్చేస్తుంటుంది. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా కూడా వెంక‌య్య ఎక్క‌డ ఏ స‌భ‌లో నైనా ఏపీ సీఎం గొప్ప‌ద‌నాన్ని - ఏపీ అభివృద్ధిని వేనోళ్ల పొగుడుతున్నారు.

తాజాగా ఆయ‌న్ను తూర్పుగోదావ‌రి జిల్లాలోని సామ‌ర్ల‌కోట‌లో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు ఆధ్వ‌ర్యంలో క‌మ‌లం పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ.. మ‌రోసారి ఏపీని - ఏపీ ముఖ్య‌మంత్రిని స్థుతించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేశారు. త‌న దైన స్టైల్లో ప్రాస‌ల‌తో కూడిన ప్ర‌సంగాలు చేయ‌డంలో దిట్ట అయిన వెంక‌య్య‌.. ఇక్క‌డా త‌న ప్ర‌సంగాన్ని ప్రాస‌ల‌తోనే ప్రారంభించి.. ప్రాస‌లు - చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల‌తో ముగించారు. హోదా కోసం ఆరోజు తాను డిమాండ్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని చెబుతూనే.. దానివ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్యాకేజీయే ప‌ర‌మాద్భుత‌మ‌ని ప్ర‌క‌టించారు.

అదేవిధంగా పోల‌వ‌రం అభివృద్ధికి - నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబును విజ‌న్ ఉన్న నేత‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. మోడీదీ-బాబు  జోడీ రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని - అప్పుడే అది అభివృద్ధి చెందుతుంద‌ని వివ‌రించారు. ఒక‌రికి ఒక‌రి అవ‌స‌రం లేకున్నా.. ప్ర‌జ‌ల‌కోస‌మే ఇద్ద‌రూ జోడీ క‌ట్టార‌ని అన్నారు. కాగా, గ‌తంలోనూ వెంక‌య్య ఏపీని, చంద్ర‌బాబును పొగుడుతూ మాట్లాడ‌డం తెలిసిందే. గుజ‌రాత్ త‌ర్వాత ఏపీయే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు.

అదేవిధంగా తాను అస‌లు ఈ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కి ప్రాతినిధ్యం వ‌హించ‌క‌పోయినా.. ఏపీ వాడిగా.. ఇక్క‌డ పుట్టాన‌నే మ‌మ‌కారంతోనే ప్యాకేజీ వ‌చ్చేలా కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. తాను లేక‌పోతే.. కేంద్రం నుంచి ఒక్క‌రూపాయి కూడా వ‌చ్చే అవ‌కాశం ఉండేది కాద‌ని కూడా ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బాబు లేక‌పోతే ఏపీ అభివృద్ధి శూన్య‌మ‌న్న ఆయ‌న ... ఎంతో స‌మ‌ర్ధుడైన సీఎం దొర‌క‌డం ఏపీ ప్ర‌జ‌ల అదృష్టంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. సో.. ఇలా.. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా వెంక‌య్య రెచ్చిపోతుండ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న అస‌లు కేంద్ర మంత్రా, రాష్ట్ర మంత్రా అనే సందేహం ఏపీ పాలిటిక్స్‌లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. అలాగే ఆయ‌న బాబు డ‌ప్పు కాస్త త‌గ్గిస్తే బెట‌రేమో అని కొంద‌రు పొలిటిక‌ల్ మేథావులు స‌ల‌హాలిస్తుండ‌డం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News