బీజేపీకి వెంకయ్యనాయుడి రాజీనామా!

Update: 2017-07-18 04:24 GMT
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బీజేపీకి... కేంద్ర మంత్రి పదవికీ రాజీనామా చేశారు. బీజేపీలో కీలక నేత ఆయన తాజాగా పార్టీ తీసుకున్న నిర్ణయంపై కొంత అయిష్టంగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వెంకయ్య రాజీనామా చోటుచేసుకుంటోంది.
    
సీనియర్ కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడిని ఉప రాష్ర్టపతి పదవికి ఎన్డీయే తరఫున పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. వెంకయ్య మాత్రం ఆ పదవి చేపట్టేందుకు పెద్దగా ఇష్టపడలేదు. తనకు క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని ఉందని.. పార్టీకి సేవ చేయాలని ఉందని చెప్పారు. కానీ.. సీనియర్ నేతగా ఉప రాష్ర్తపతి పదవికి.. తద్వారా రాజ్యసభ ఛైర్మన్ హోదాలో పెద్దల సభను నిర్వహించేందుకు ఆయనే తగినవారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పట్టుపట్టడం.. ప్రధాని మోడీని కూడా ఒప్పించడంతో ఆయన ఈ పదవికి నామినేషన్ వేయక తప్పని పరిస్థితి వచ్చింది.
    
అయితే... ఉప రాష్ర్టపతి పదవికి పోటీ చేయాలంటే ఇతర పదవులను వదిలేయాల్సి ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండకూడదు. దాంతో వెంకయ్య ఇప్పుడు తన కేంద్ర మంత్రి పదవికి... భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు వెంకయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Tags:    

Similar News