ఎన్డీటీవీ బ్యాన్ పై వెంకయ్యది తొండి వాదనా?

Update: 2016-11-06 04:15 GMT
ప్రముఖ వార్తా ఛానల్ ఎన్డీటీవీ ప్రసారాలపై కేంద్రం ఒకరోజు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పఠాన్ కోటపై ఉగ్రవాదుల దాడుల సందర్భంగా ఆ ఛానల్ ప్రసారం చేసిన కొన్ని విజువల్స్ పై కేంద్రం సీరియస్ కావటమే కాదు.. అందుకు శిక్షగా ఒక రోజు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై తాజాగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వర్గాల నుంచి పాత్రికేయ వర్గాల వరకూ ఎన్డీటీవీపై వన్ డే బ్యాన్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో మోడీ సర్కారు సెకెండ్ ఎమర్జెన్సీకి తెర తీస్తుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబడుతున్నారు.

ఎన్డీటీవీపై వన్ డే బ్యాన్ అంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆ ఒక్క ఛానల్ మీదనే కాదు.. ఈ నిర్ణయం మీడియా మొత్తానికి ఒక వార్నింగ్ లాంటిదిగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. సాపేక్షంగా చూస్తే ఇది నిజమని చెప్పాలి. పఠాన్ కోట దాడి సందర్భంగా అవాంఛనీయమైన దృశ్యాల్ని ఎన్డీటీవీ ప్రసారం చేసిందని భావిస్తే.. ఆ ఛానల్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసి ఉంటే సరిపోయేది. లేదంటే.. సదరు ఛానల్ చేసిన తప్పునకు క్షమాపణలు కోరుతూ.. 24 గంటల పాటు స్క్రోలింగ్ ఇవ్వాలన్న ఆదేశాలు సరిపోతాయి. ఒక్కరోజు నిషేధం రూల్ బుక్ ప్రకారం జరిగినట్లు చెబుతున్నా.. గతంలో కొన్ని ఛానళ్ల విషయంలో యూపీఏ సర్కారు సైతం బ్యాన్ విధించిందని చెప్పినా.. అవేమీ సబబుగా అనిపించవని చెప్పక తప్పదు.

ఎన్డీటీవీ తప్పు చేసిందనే అనుకున్నా.. అలాంటి తప్పులు తరచూ చేస్తుంటే ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అలాంటిదేమీ లేదన్నవిషయాన్ని మర్చిపోకూడదు. ఇక.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. వెరైటీ వాదనను వినిపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డగోలుగా సమర్థించే ప్రయత్నం చేశారు.

ప్రసార మాధ్యమాల స్వేచ్ఛపై మోడీ సర్కారుకు అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేసిన ఆయన..  నిబంధనలు ఉల్లంఘించినందుకు టీవీ ఛానల్ పై నిషేధం విధించినట్లుగా చెప్పుకొచ్చారు. దేశ భద్రత విషయంలో రాజకీయ విమర్శలు చేయటం సరికాదన్న ఆయన.. విమర్శించేందుకు విపక్షాలకు ఎలాంటి అవకాశం లేకపోవటంతో ఈ వ్యవహారాన్ని వివాదం  చేయటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు. ఛానల్ ను నిషేధించటం కోసం కొత్త చట్టాలు ఏమీ చేయలేదని చెప్పిన ఆయన.. నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామన్నారు.

2014 -15 మధ్య కాలంలో ఒక రోజు నుంచి రెండు నెలల పాటు 21 సార్లు టీవీ ఛానళ్లపై నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. అలా నిషేధం వేటు పడ్డ ఛానళ్ల వివరాలు వెల్లడిస్తూ.. ‘‘గతంలో ఏఎక్స్ ఎన్..ఎఫ్ టీవీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఆల్ జజీరా లాంటి ఛానళ్లు నిషేధం వేటు పడ్డాయి. దేశంలో రెండో అత్యవసర పరిస్థితులు కనిపిస్తున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ.. ప్రధానిని విమర్శించటం పరిపాటిగా మారిపోయింది. కేబుల్ టీవీ నియంత్రణ చట్టం ప్రకారం దేశ భద్రత దృష్ట్యా అభ్యంతరకర ప్రసారాలను నియంత్రించేహక్కు ప్రభుత్వానికి ఉంది’’ అని వ్యాఖ్యానించారు. నిషేధంపై వెంకయ్య తమ చర్యను సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం తొందరపాటు చర్యగా.. మీడియాకు తమదైన శైలిలో మోడీ సర్కారు ఇస్తున్న వార్నింగ్ గా చెప్పక తప్పదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News