పవన్ ని వేసుకున్న వెంకయ్య

Update: 2017-01-28 09:52 GMT
హైద‌రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పిచ్చాపాటి సమావేశం నిర్వాహించారు. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మ‌క్షంలోనే ఆయ‌న ప‌లు అంశాలు మాట్లాడారు. జల్లికట్టు పై వాస్తవాలు గుర్తించి మాట్లాడితే బాగుండేదని పవన్ కళ్యాణ్  పై పరోక్ష విమర్శలు గుప్పించారు. జల్లికట్టు పై 2011 లో నాటి యూపీఏ ప్రభుత్వం నిషేధించిందని వెంక‌య్య నాయుడు గుర్తు చేశారు. ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీ అని పేర్కొంటూ ఇది కూడా తెలియక పోతే ఎలా అంటూ ప‌వ‌న్ తీరును ఎద్దేవా చేశారు. ఏమీ చెయ్యకుండా ట్విట్టర్ పట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్లో తిరగకుండా ట్విట్టర్ లోనే వాస్త‌వాలు ఎలా తెలుస్తాయ‌ని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి ఉత్తరాది...దక్షిణాది అంటూ పోలిక ఏంటని వెంక‌య్య‌నాయుడు ప్ర‌శ్నించారు. ప్రాంత విద్వేషాలు రెచ్చ గొట్టడం పద్ధతి కాదని, దేశం అంతా ఒక్కటన్నదే  బీజేపీ లక్ష్యమ‌ని వెంక‌య్య నాయుడు ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేవారు ఎవరు ప్రత్యేక హోదా ను అడగటం లేదని వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీకి హోదాను మించిన అదా కేంద్రం ఇస్తుందని వెంక‌య్య తెలిపారు. త‌మ ప్ర‌మేయం లేక‌పోయినా ఏపీ మంచి పేరు వచ్చేస్తోందని భావిస్తూ కొందరు హోదా పై రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ గురించి ప్ర‌స్తావిస్తూ... కేంద్రం సహకారం అందిస్తున్న‌ది తెలంగాణ కోసమే త‌ప్ప టీఆర్ ఎస్‌ కు కాద‌ని వెంక‌య్య స్ప‌ష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంద‌ని తెలిపారు. మైనార్టీ రిజర్వేషన్ లను బీజేపీ వ్యతిరేకిస్తుందని ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వం వాటిని ప్ర‌వేశ‌పెట్టిన కోర్టుల్లో నిలబడదని స్ప‌ష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ - గోవా - ఉత్తరాంచల్ లో బీజేపీ గెలుపు ఖాయమ‌ని ప్ర‌క‌టించారు. మోడీ దేశాన్ని మరో పదేళ్ళు పాలిస్తే.. దేశం సంపూర్ణంగ అభివృద్ధి అవుతుందని వెంక‌య్య ధీమా వ్య‌క్తం చేశారు. మోడీ విప్లవాత్మక నిర్ణయంతో దేశంలో అవినీతి అంతం అవుతుందని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి  సరిగ్గా రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యిందని చెప్పిన వెంక‌య్య నాయుడు - ప్ర‌భుత్వం వ‌చ్చిన తర్వాత ఎం జరిగింది అని అవలోకనం చేసుకోవాలని కోరారు. దేశంలో ప్రధాని మోడీ పెనుమార్పులు - విప్లవాత్మక మార్పులు తెచ్చాడని ప్ర‌శంసించారు. మొదట్లో పార్టీ మీద కుల - మత - వర్గ ప‌క్ష‌పాతి అంటూ అనేక ముద్రలు వేశారని వాటిని అయినా మార్చడానికి ప్రయత్నం చేసామని వివ‌రించారు. ప్రధాని రాట్నం వాడికిన చిత్రం పెడితే తప్పేంటని వెంక‌య్య ప్ర‌శ్నించారు. మోడీ ఖాదీ వేసిన తర్వాత..30 శతం అమ్మకాలు పెరిగాయని తెలిపారు. ఎవరూ చెయ్యలేని  పని ప్రధాని మోడీ తన నాయకత్వం కారణంగా చేయగలిగారని కితాబిచ్చారు.  కొత్త నోట్లలో జియో ట్యాగింగ్ టెక్నాలజీ ఉందని, ప్రతి నోటుకు తండ్రి - తల్లి ఎవరో తెలుస్తుందని తెలిపారు. నెహ్రు - గాంధీ కుటుంబం ఏం తప్పు చేసినా అదే నిజం అని అనేలా ప్రచారం చేశారని  ఇప్పుడు బీజేపీ - కేంద్ర ప్ర‌భుత్వం ప్రజల కోసం చేస్తున్న పనులను మీడియా కూడా  చూస్తోందని వెంక‌య్య నాయుడు వివ‌రించారు. కాంగ్రెస్ చీలినప్పుడు.. ఇందిరా పంచన కమ్యూనిస్టులు  చేరారని  ఇపుడు అనేక సంస్థ‌ల్లోకి వారు చొచ్చుకొని పోయార‌ని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీ ల్లో కమ్యూనిస్టుల ప్రవేశం తర్వాత ఆఫ్జల్ గురు జయంతి జరిగే వరకు వెళ్ళిందని విశ్లేషించారు. రెండున్నర సంవత్సరాల తర్వాతా  62 శాతం ప్రజలు మోడీనే ప్రధాని కావాలని అంటున్నారు. 360 సీట్లు మోడీ ప్రభుత్వానికి వస్తాయని సర్వే చెపుతోందని గుర్తు చేశారు. దేశంలో మోడీ పలుకుబడి రోజు రోజుకు పెరుగుతోంద‌ని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News