మ‌నోళ్లే లేకుంటే సిలికాన్ వ్యాలీ మూతే!

Update: 2018-07-28 04:46 GMT
వెంక‌య్య‌నాయుడు ఇప్పుడు ఆషామాషీ వ్య‌క్తి కాదు. 130 కోట్ల‌కు పైగా జ‌నాభా ఉన్న దేశానికి ఆయ‌న ఉప రాష్ట్రప‌తి. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌ల‌కు తీవ్ర‌త మామూలుగా ఉండ‌దు. తొంద‌ర‌ప‌డి నోరు జారే అల‌వాటు వెంక‌య్య‌కు లేదు. కానీ.. ఆయ‌న నోటి నుంచి తాజాగా వ‌చ్చిన మాట‌లు ప్ర‌పంచానికే పెద్ద‌న్న అయిన అమెరికాకు ఆగ్ర‌హం క‌ల్పించేలా ఉన్నాయ‌ని చెప్పాలి.

చుట్టూ మ‌నోళ్లు ఉన్న ఆనందంతోనో.. భార‌తీయ ఐటీ ప‌రిశ్ర‌మ గొప్ప‌త‌నాన్ని.. భార‌తీయ ఐటీ నిపుణుల మేధ‌స్సు రేంజ్ ఏంతో చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించారో.. లేదంటే.. తాను చెప్పాల‌నుకున్న‌దే చెప్పారో కానీ.. ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇతర దేశ‌స్థుల వీసాల మీద అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఏదేదో మాట్లాడుతున్నార‌ని.. అమెరికా అభివృద్ధిలో ఇత‌ర దేశాలు.. ముఖ్యంగా భార‌తదేశ భాగ‌స్వామ్యం ఎంతో ఉంద‌న్నారు. ట్రంప్ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఫ్యూచ‌ర్లో అమెరికా అధిప‌త్యం కొన‌సాగ‌ద‌ని తేల్చారు. అంతేకాదు.. అమెరికా పేద దేశంగా మారుతుంద‌న్న హెచ్చ‌రిక‌ను చేశారు.

ఈ రోజు సిలికాన్ వ్యాలీలో ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రు భార‌తీయుల‌ని.. అందులోనూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వారే ఎక్కువ‌గా క‌నిపిస్తార‌న్నారు. వారిని తిరిగి పంపిస్తే సిలికాన్ వ్యాలీ ఉంద‌న్నారు. ఐటీ వ‌ల్లే హైద‌రాబాద్ పేరు అంత‌ర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంద‌న్న ఆయ‌న‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పని ఒత్తిడితో ఉన్న ఐటీ ఉద్యోగులు ఆరోగ్య‌స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని.. వీటిని అధిగ‌మించేందుకు ప్ర‌తి రోజూ యోగా చేయాల‌న్నారు. పొద్దున్న సూర్య న‌మ‌స్కారం చేయ‌టం వీలు కాకుంటే రాత్రి చంద్ర న‌మ‌స్కార‌మైనా చేయాలంటూ అంత్య‌ప్రాస‌తో పంచ్ వేశారు. ఫాస్ట్ ఫుడ్ తో రోగాలు ఫాస్ట్ గా వ‌స్తాయ‌ని.. వాటిని విడిచి పెట్టి ఆరోగ్య‌క‌ర జీవితాన్ని అస్వాదించాల‌న్న సూచ‌న‌ను చేశారు. ఉప రాష్ట్రప‌తి హోదాలో ఉంటూ అమెరికా అధ్య‌క్షుడి తీరుపై చేసిన విమ‌ర్శ‌కు వైట్ హౌస్ ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News