టీ కాంగ్రెస్ లో రూ.4 కోట్ల తుఫాన్‌

Update: 2016-01-02 09:55 GMT
నిరాశ‌..నిస్పృహ‌ల‌లో కూరుకుపోతున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు కొండంత ధైర్యాన్ని తాజాగా ముగిసిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇచ్చాయ‌ని చెప్పాలి. ఉనికి కోసం కిందామీదా ప‌డుతున్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. క‌లిసిక‌ట్టుగా పోరాడితే ఫ‌లితాలు రావొచ్చ‌న్న విష‌యాన్ని తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌లుస్ప‌ష్టం చేశాయి. అయితే.. ఈ ఆనందం నాలుగు రోజులు కూడా నిల‌వ‌కుండా చేసేలా తాజాగా ఒక వివాదం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల‌కు త‌ల‌ల‌కు చుట్టుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య‌నేత‌లు త‌న‌ను రూ.4కోట్లు అడిగారంటూ నిజామాబాద్ మాజీ జెడ్పీ ఛైర్మ‌న్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాలంటే రూ.4కోట్లు ఇవ్వాల‌ని చెప్పార‌ని.. త‌న చేత రూ.2కోట్లు డిపాజిట్ చేయాల‌ని చెప్పార‌ని.. అదే విధంగా చేయించార‌ని ఆరోపించారు.

తాను రూ.2కోట్లు డిపాజిట్ చేసిన త‌ర్వాతే త‌న‌కు ఎమ్మెల్సీ టిక్క‌ట్టు ఇచ్చిన‌ట్లు చెప్పిన వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి.. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. త‌న‌ను డ‌బ్బులు డిమాండ్ చేసిన వారిలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ష‌బ్బీర్ అలీ.. మ‌దుయాష్కీ గౌడ్‌.. మహేశ్ గౌడ్ పేర్ల‌ను ఆయ‌న చెబుతున్నారు. రూ.2కోట్లు చెల్లించిన త‌ర్వాత మిగిలిన రూ.2కోట్లు డిమాండ్ చేశార‌ని.. ఓట‌మి భ‌యంతో తాను పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అందుకే తాను ఇచ్చిన రూ.2కోట్లు త‌న‌కు తిరిగి ఇవ్వాల‌ని అంటున్నారు. ఓట‌మి భ‌యంతో బిక్కుబిక్కుమంటూ.. పోటీకి ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితులున్న ప‌రిస్థితుల్లో కోట్లాది రూపాయిలు డ‌బ్బులు టిక్కెట్ల  కోసం అడిగే ప‌రిస్థితి ఉందా? అంటూ కొంద‌రు టీ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ రూ.4కోట్ల ఇష్యూ ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News