కుక్క ఎపిసోడ్ పై ప్రగతి భవన్ సీరియస్

Update: 2019-09-15 05:09 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ లో ఉండే తొమ్మిది కుక్కల్లో ఒకటి అనారోగ్యంతో మరణించటం తెలిసిందే. అయితే.. ప్రగతిభవన్ కుక్క మరణం వెనుక వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరించటమేనని.. పోలీసులకు ప్రగతిభవన్ లో కుక్కుల్ని సంరక్షించే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

ఈ అంశం బయటకు పొక్కింది. కేసు నమోదు చేసినప్పుడు.. కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టటం మామూలే. అయితే.. ఈ అంశం బయటకు పొక్కటంపై ప్రగతిభవన్ గరంరగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న పరిణామాలు.. బయటకు ఎలా వెళుతున్నాయి? ఇందుకు బాధ్యులు ఎవరు? అన్న దానిపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైద్యుల నిర్లక్ష్యంతో కుక్కపిల్ల చనిపోయిందంటూ చేసిన కంప్లైంట్ లోని వివరాలు మీడియాకు ఎలా అందాయి?  అన్న అంశంపై ప్రగతి భవన్ వర్గాలు సీరియస్ కావటంతో పాటు.. ఈ వార్తను కవర్ చేసిన ప్రధాన మీడియా సంస్థలపైనా ఫోకస్ చేసినట్లుగా సమాచారం.

ముద్దుగా పెంచుకున్న కుక్క చావు ఒక వేదన అయితే.. ఈ ఎపిసోడ్ లో కేసుపెట్టిన వైనం బయటకు పొక్కి.. సోషల్ మీడియాలో సారుపై పంచ్ లు మీద పంచ్ లు.. ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ప్రగతిభవన్ లోపలి విషయాలు బయట ప్రపంచానికి తెలీటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుక్క ఎపిసోడ్ నేపథ్యంలో ప్రగతిభవన్ లో పని చేసే పలువురు సిబ్బందికి స్థానచలనం తప్పదని.. ఏ విషయం బయటకు పొక్కకూడదన్న అంశాన్ని ప్రాథమికంగా అందరూ మర్చిపోతున్నారంటూ భారీ క్లాస్ పడినట్లు తెలుస్తోంది. ఇక.. పోలీసు అధికారులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారి.. కంటి మీద కునుకు పడకుండా చేస్తున్నట్లు వాపోతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News