కర్నూలులో దీక్షకు దిగిన వీహెచ్.. ఎందుకంటే?

Update: 2022-02-12 16:52 GMT
అనూహ్యంగా వ్యవహరిస్తుంటారు సీనియర్ కాంగ్రెస్ నేత.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వీహెచ్ హనుమంతరావు. విడిపోయి కలిసి ఉందామనే తెలంగాణవాదుల విభజన నినాదానికి కేరాఫ్ అడ్రస్ లా నిలిచే నేత ఎవరైనా ఉన్నారంటే ఒక్క వీహెచ్ మాత్రమే. రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఏపీ సమస్యల్ని ప్రస్తావించటం.. తరచూ తన అభిప్రాయాల్ని వెల్లడించటం.. తాజాగా ఏకంగా దీక్షకు దిగటం ద్వారా.. అసలుసిసలు తెలంగాణ విభజనవాదిగా ఆయన తనలోని మరో రూపాన్ని బయటపెట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతూ.. సొంత పార్టీ నేతల మీద విరుచుకుపడేందుకు ఏ మాత్రం మొహమాటపడని వీహెచ్.. తాజాగా ఏపీలోని కర్నూలులో దీక్షకు దిగి.. అందరిని విస్మయానికి గురి చేశారు. ఇంతకూ ఆయన దీక్ష ఎందుకు చేపట్టారన్న విషయాన్ని చూసినప్పుడు.. ఏపీ నేతలు.. ముఖ్యంగా కర్నూలు జిల్లా నేతలంతా సిగ్గుపడేలా ఆయన వ్యవహరించారు.

వైఎస్ జగన్ సర్కారు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలంటూ వీహెచ్ దీక్షకు దిగారు. శనివారం కర్నూలులోని దామోదరం సంజీవయ్య ఇంటి దగ్గర దీక్షకు దిగారు. ఆయనతో పాటు మరో సీనియర్ కాంగ్రెస్ నేత.. ఏపీకి చెందిన హర్షకుమార్ కూడా దీక్ష చేపట్టారు. కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్తజిల్లాల ఏర్పాటుతో ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత వీహెచ్ దీక్షకు దిగటం.. దామోదరం పేరును జిల్లా పేరుగా పెట్టాలన్న డిమాండ్ తో దీక్షకు దిగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కడప జిల్లాకు వైఎస్సార్.. క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్.. మన్యం ప్రాంతాలకు అల్లూరి పేర్లు పెట్టిన జగన్ సర్కార్.. కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలన్న ఆలోచన రాకపోవటం దురదృష్టకర విషయంగా ఆయన అభివర్ణించారు. స్థానిక నేతలు సైతం ముఖ్యమంత్రి జగన్ మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరుతున్నారు.

ఇదే డిమాండ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తొలిసారి తీసుకురావటం గమనార్హం. కర్నూలులోని దామోదరం నివాసం వద్ద.. ఆయన విగ్రహం పక్కనే దీక్షకు దిగిన వీహెచ్ తో పాటు దామోదరం సంజీవయ్య ఐక్య వేదిక నేతలు కూడా పాల్గొన్నారు. ఒకవైపు ఈ డిమాండ్ నడుస్తుంటే.. మరోవైపు పల్నాడుకు గుర్రం జాఘువా పేరు పెట్టాలని కోరుతూ గుంటూరులో ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్.. లక్ష్మణ రావు.. డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు హాజరయ్యారు. మరి.. ఈ డిమాండ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి
Tags:    

Similar News