సండే గార్డియన్ కూడా కక్కుర్తి పడిందా?

Update: 2016-03-15 07:33 GMT
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎపిసోడ్ లో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బ్యాంకులకు రూ.9వేల కోట్ల రూపాయిలు అప్పు పడి.. వాటిని చెల్లించటంలో విఫలమైన మాల్యా.. గుట్టు చప్పుడు కాకుండా దేశం నుంచి వెళ్లిపోవటంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లోని తన ఫాంహౌస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించటం లేదు.

ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం సండే గార్డియన్ మీడియా సంస్థ.. మాల్యా తమకు ఈ-మొయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారంటూ సంచలన వార్తా కథనాన్ని వెల్లడించింది. ఆ మధ్యన ట్విట్టర్ తో కొన్ని ట్వీట్లు మినహా మాల్యా నుంచి ఎలాంటి స్పందన లేని సమయంలో.. ఆయన సండే గార్డియన్ మీడియాతో మాట్లాడారన్న ఈ-మొయిల్ ఇంటర్య్వూ అందరిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే.. తాను ఇంటర్వ్యూ ఇచ్చినట్లు చెబుతున్న సండే గార్డియన్ ను తాను అస్సలు ఇంటర్వ్యూ ఇవ్వలేదని.. తాను ప్రోటాన్ అకౌంట్ ద్వారా ఈ-మొయిల్   చేసినట్లుగా చెబుతున్నారని.. అసలు ఫోటాన్ లో తనకు అకౌంటే లేదని మాల్యా తాజాగా చేసిన ట్వీట్ లో స్పష్టం చేయటం  ఆసక్తికరంగా మారింది. సండే గార్డియన్ లాంటి ప్రముఖ మీడియా సంస్థ సైతం.. మాల్యా విషయంలో పాఠకుల్ని బురిడీ కొట్టించిందా? రేటింగ్ కోసం కక్కుర్తి పడిందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అదే సమయంలో.. బ్యాంకులను భారీగా మోసగించిన మాల్యా మాటను నమ్మాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

గార్డియన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తానిప్పట్లో దేశానికి రాలేనని.. తాను భారత్ కు వెళ్లే పరిస్థితులు అక్కడ లేవని.. తాను వెళ్లినా తన మీద విచారణ విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు కలగటం లేదంటూ మాల్యా చెప్పిన విషయాలు తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పలు మీడియా సంస్థలు వార్తలుగా ఇచ్చారు. ట్విట్టర్ లో తాజాగా మాల్యా చేసిన ట్వీట్స్ పై సండే గార్డియన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News