ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. ఆ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా విజయ్ రూపానీని మరోసారి ఎన్నుకున్నారు. శాసనసభపక్ష ఉపనేతగా నితిన్ భాయ్ పటేల్ ను ఎన్నుకున్నారు. దీంతో... గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ - ఉపముఖ్యమంత్రిగా నితిల్ పటేల్ కు మరోసారి అవకాశం రానుంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు.
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తించిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 9 - 14న రెండు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మొత్తం 182 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ 77 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 92ను దాటేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతోంది.
ఇదిలాఉండగా...సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనే అంశంపై బెట్టింగ్ లు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి విజయ్ రూపాని - ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ల నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికలను మోడీ సారథ్యంలోనే ఎదుర్కొన్నారు. ‘ఈసారి తక్కువ మెజార్టీతో గెలిచినందున - ముఖ్యమంత్రిని మార్చాలని పార్టీ యోచిస్తోంది’ అని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తన నేతృత్వంలోనే పోరాడిందని - అయితే తుది నిర్ణయం మోడీ - పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటాయని రూపాని చెప్పారు. కాగా తాజా నిర్ణయంతో ఈ చర్చకు బ్రేక్ పడింది. కొత్త సర్కారు ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాల సమాచారం.