కోడెలకు విజయసాయిరెడ్డి కౌంటర్‌

Update: 2019-01-30 13:08 GMT
 ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. ఈసారి కూడా వైసీపీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. నిన్న మీడియాతో మాట్లాడిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. తాను ప్రతిపక్ష నేత జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, కానీ మాట్లాడేందుకు ఆయనే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. తద్వారా.. సభకు వైసీపీ కావాలనే డుమ్మా కొడుతుందని చెప్పే ప్రయత్నం చేశారు.

కోడెల వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఒక పోస్ట్‌ చేశారు. ప్రతిపక్షం సభకు ఎందుకు రావడం లేదో తనకు తెలియదన్న స్పీకర్‌కు.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుక్కుందని.. అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని విషయం అయినా తెలుసా లేదా అని ప్రశ్నించారు. ఇలా విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ..పార్టీ మారిన 23 మంది ఫోటోలు పెట్టారు విజయసాయిరెడ్డి.

మరోవైపు కియా మోటర్స్‌ ట్రైల్ రన్‌పై కూడా విజయసాయిరెడ్డి కౌంటర్స్‌ వేశారు. కియా కార్ల ఫ్యాక్టరీ టీడీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం ఉపయోగపడిందని.. కియాలో యువతకు దక్కింది చాలా తక్కువ ఉద్యోగాలే అని గుర్తు చేశారు. భూముల వివరాలను ముందే సంపాదించి చుట్టుపక్కల రైతులను బెదిరించి వేల ఎకరాలను కారు చౌకగా కొట్టేశారని.. వందల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఇక కియా కారులో చంద్రబాబు ప్రయాణం చేసిన ఫోటోకి.. “మంచిది తమరు అధికారం వెలగబెట్టే ఈ రెండు నెలల ప్రత్యేక విమానాల జల్సాలు ఆపి ఈ కార్లలోనే తిరగండి” అంటూ పోస్ట్‌ చేశారు విజయసాయిరెడ్డి. పేదలకు కనీస ఆదాయ భరోసా హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కూడా విజయసాయి రెడ్డి కౌంటర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అని నినాదం ఇచ్చి 40 ఏళ్లయిందని, కానీ దేశంలో పేదరికం ఇంకా అలాగే ఉందన్నారు.   
Tags:    

Similar News