వైఎస్ వివేకాది అనుమానాస్పద మృతే: విజయసాయిరెడ్డి

Update: 2019-03-15 07:33 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం అందరినీ శోకసంద్రంలో ముంచివేసింది. ఆయన మరణం అనుమానాలకు తావిచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణా రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తలపై గాయం ఉండడం.. చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు సైతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం నిగ్గుతేలుస్తామని తెలిపారు.

కాగా వైఎస్ వివేకానందారెడ్డి హఠాన్మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందని.. కానీ పరిసరాలు చూస్తే వివేకానంద రెడ్డి మృతిపై అనుమానం కలుగుతుందన్నారు.

ఇది సహజ మరణమా? లేక ఎవరైనా ఉన్నారా అనే దానిపై లోతైన దర్యాప్తు ద్వారా తేల్చాలని వైసీపీ తరుఫున డిమాండ్ చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకా అంత్యక్రియల కోసం వైఎస్ జగన్ కారులో బయలు దేరి అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలిపారు. తమకు సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతి అనుకుంటున్నామని తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యాకే ఎలాంటి మృతి అనేది తెలుస్తుందని తెలిపారు. వివేకానంద మృతిచెందిన సందర్భంలో రాజకీయాలు మాట్లాడడం సరికాదని అంత్యక్రియలు ఈరోజు లేదా రేపు జరిగే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు.
Tags:    

Similar News