'అతి' ప్రచారంతో అడ్డంగా బుక్ అయిన విజయసాయి

Update: 2022-11-10 07:30 GMT
నిజమే చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాన్ని కూడా అందంగా చెప్పొచ్చు. కీలక స్థానాల్లో ఉండి కూడా తప్పుడు ప్రచారం చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఎవరు అడుగుతారు? చెప్పండన్న బరితెగింపు ఏపీ అధికారపక్ష నేతల్లో కొందరికి ఎక్కువైంది. అలాంటి పనే చేసిన రాజ్యసభ సభ్యులు.. వైసీపీ కీలక నేతల్లో ఒకరు విజయసాయి రెడ్డి. దక్షిణాదిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న వేళ.. ఆయన టూర్ తొలుత ఏపీతో మొదలు కానున్న సంగతి తెలిసిందే.

ఏపీకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. విశాఖకు రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నట్లుగా పేర్కొంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఆయన ఫోటోతో సహా కలర్ ఫుల్ గా విజువల్స్ ను సిద్ధం చేసి.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వదిలారు.

నవంబరు 12న ఏపీ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విభజన హామీల్లో ఒకటైన.. విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన జరగనున్నట్లుగా భారీ ప్రచారం చేపట్టారు. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూల బొకే ఇస్తున్నట్లుగా పాత ఫోటో ఒకటి తీసుకొని.. కొత్త తరహాలో సిద్ధం చేసి ప్రచారానికి జనం మీదకు వదిలారు.

దీంతో.. నిజంగానే ప్రధాని మోడీ టూర్ లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన జరుగుతుందని పెద్ద ఎత్తున నమ్మేశారు. తాజాగా అలాంటి ప్రోగ్రాం ఏమీ లేదన్న విషయాన్ని అధికార ఎజెండా స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని రాక సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన విజయసాయి స్రచారం..

తాజా పరిణామాలతో చూస్తే.. అతిగా అనిపించక మానదు. జరగని ప్రోగ్రాంను జరుగుతుందన్న ప్రచారం దేనికి నిదర్శనం? అన్నది ప్.శ్నగా మారింది. విజయసాయి సోషల్ మీడియా పేజీ చూసే వారికి.. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేసేలా కనిపిస్తున్నా..

వాస్తవానికి ఆ పనులు ఏమీ లేకపోవటంచూస్తే.. విజయసాయి అతి ప్రచారం ఆయనకు ఇబ్బందుల్నితెచ్చి పెట్టేలా ఉందన్న మాట వినిపిస్తోంది. తాను అంత డాబుగా ప్రచారం చేసుకున్నది ఏమీ జరగకపోవటానికి కారణం ఏమిటన్నదైనా విజయసాయి క్లారిటీ ఇస్తారా? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News