బాబు సీఎం కాదు..ఒక మేనేజ‌ర్:విజ‌య‌సాయి

Update: 2018-01-24 13:07 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబు పాల‌న‌పై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్ర‌`బాబా` పాల‌న‌లో రాష్ట్రంలో అవినీతి - లంచ‌గొండితనం - అక్ర‌మాలు - అన్యాయాలు పెరిగిపోయాయ‌ని మండిప‌డ్డారు. 2014లో బాబు అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఏపీలో మ‌హిళ‌లు - ద‌ళితులు - మీడియాపై దాడులు పెరిగిపోయాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌హ‌నీయుడు అంబేడ్క‌ర్ ర‌చించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్య‌తిరేకంగా ఏపీలో చంద్ర‌బాబు ఒంటెత్తుపోక‌డ పాల‌న న‌డుస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు. వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి ఆయన బుధవారం విశాఖపట్నంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న చేయ‌డం లేద‌ని......కేవ‌లం ఒక మేనేజ‌ర్ బాధ్య‌త‌ను మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నార‌న్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్ర‌బాబు ప‌బ్బం గ‌డుపుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు. 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసి, త‌న పార్టీలోకి ఆహ్వానించ‌డ‌మే కాక.....కొంద‌రికి మంత్రిప‌ద‌వి ఇచ్చి రాజ్యాంగ వ్యవస్థను అప‌హాస్యం చేశార‌ని చెప్పారు. ప‌క్క రాష్ట్రాల్లో జంప్ జిలానీల‌పై అనర్హత వేటు వేస్తున్నార‌ని, కానీ మ‌న రాష్ట్రంలో మంత్రి పదవులతో గౌర‌వించ‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. కేవ‌లం ఒక సామాజిక వర్గానికే కొమ్ముకాయడం బాధాక‌ర‌మ‌న్నారు. భూసేకరణ చట్టంలో ఇష్టానుసారం మార్పులు చేసి - త‌న అనుయాయుల‌కు - అస్మ‌దీయుల‌కు ప్రాజెక్టులను క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌ని దుయ్య‌బ‌ట్టారు. వారి ద్వారా సంపాదించిన వేల కోట్ల అవినీతి సొమ్మును మనీ లాండరింగ్‌ ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగం - కేంద్రం నియ‌మ‌నిబంధ‌న‌లు - మార్గ‌ద‌ర్శ‌కాలపై చంద్ర‌బాబుకు ఇసుమంతైనా గౌర‌వం లేద‌ని - ఏపీ డీజీపీ నియామకంలో నాట‌కీయ‌ప‌రిణామాల మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని నియమించుకున్నారని ఆరోపించారు. ఫైబర్‌ గ్రిడ్‌ పేరుతో జ‌నాల‌కు మంచి చేస్తున్న‌ట్లు భ్ర‌మ క‌ల్పించి.....టీడీపీ స‌ర్కార్ వ్యతిరేక చానెళ్లను మూసేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం  అనుమతిలేని బోటులో  ప్ర‌యాణించి కొంద‌రు అశువులు బాసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే..... రాష్ట్రపతి సతీమణిని కూడా అనుమ‌తి లేని బోటులో ప్రయాణించేలా చేసిన ఘ‌న‌త చంద్రబాబుద‌న్నారు. వైసీపీ కార్యకర్తలను నడిరోడ్డుమీద నరికినా......నిందితుల‌ను అరెస్టు చేయడం లేదని - గూండాల‌ను - చట్టవ్యతిరేక శక్తులను బాబు ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 29వ తేదీ నాటికి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుందని, దీంతో, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో స్మార‌క స్తూపాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. అలుపెరుగ‌కుండా - మ‌డమ తిప్ప‌కుండా దాదాపు 3 వేల‌ కిలోమీటర్లు మేర‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన‌ సందర్భంగా ప్రతి మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిలో మార్చ్‌ లేదా పాదయాత్ర చేపట్టాలని పిలుపునిచ్చారు. మ‌రోవైపు, చంద్ర‌బాబు అరాచకాలపై  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిప‌డ్డారు. టీడీపీ ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు అవినీతిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే....త‌మ‌పై అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌న‌కో నీతి ప్ర‌తిపక్షానికో నీతి అన్న రీతిలో చంద్ర‌బాబు వైఖ‌రి ఉండ‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. విభ‌జ‌న హామీలను కేంద్రం నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్తానన్న చంద్రబాబును ఏ పేరుతో పిల‌వాని ఎద్దేవా చేశారు. మిత్రపక్షం బీజేపీ తో తెగ‌దెంపులు కాకుండానే, దానిపై కోర్టుకు వెళ్తాననడం సిగ్గుచేట‌న్నారు. కేంద్ర కేబినెట్ లో టీడీపీ మంత్రులు లేరా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News