చరిత్ర తిరగరాసిన పునరపి విజయన్ !

Update: 2021-05-03 07:52 GMT
కేరళ .. దేశంలోనే అక్షరాస్యత లో అగ్రగ్రామిగా ఉన్న రాష్ట్రం. అందుకే అక్కడ గత కొన్నేళ్లుగా ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన పాపాన పోలేదు. ఎందుకంటే ప్రభుత్వం మారితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అంటారు, కేరళ వాసులు దాన్ని పాటిస్తారు. కానీ, కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి తెరపడింది. 1980 నుంచి కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఈ సంప్రదాయానికి మలయాళీలు స్వస్తి పలికారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘోర పరాజయం మూటగట్టుకున్నా, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కేరళలో కరోనా కట్టడికి విజయన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం దేశానికి ఓ మోడల్‌ గా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయానికి ముఖ్యమంత్రి విజయన్ చరిష్మా ప్రధాన కారణం. కేరళలో రాజకీయ ప్రకంపనలు రేపిన బంగారం దొంగ రవాణా కుంభకోణం విజయన్ ప్రభుత్వంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని తాజా ఫలితాలతో రుజువయ్యింది.  నిఫా, కరోనా మహమ్మారులను సమర్థంగా ఎదుర్కోవడం.. 2018 వరదల తర్వాత పరిస్థితులను వేగంగా చక్కబెట్టడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలే , కేరళ ఓటర్లు ఆయన వెంట ఉండేలా చేశాయి. 2016 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించగా.. మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్‌ ను పక్కనబెట్టి పినరయి విజయన్‌ను సీఎంగా ఎంపిక చేశారు. కేరళ వరదలు, కరోనా సంక్షోభంలో ఆయన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తమయ్యింది. అందుకు ఈ ఎన్నికల్లో విజయమే నిదర్శనం. విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ విజయం నమోదు చేసింది.

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార ఎల్‌ డీఎఫ్‌ 99 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 41 స్థానాలకు పరిమితమైంది. భాజపా బోణీ కొట్టలేకపోయింది. ఉన్న ఒక్కస్థానాన్నీ కోల్పోయింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కన్నూర్‌లోని ధర్మదామ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సి.రఘునాథన్‌పై 50,123 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2016లో విజయన్‌కు 36,905 ఓట్ల మెజారిటీ వచ్చింది.  కేరళకు 2018 ఆగస్టులో వచ్చిన వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అన్ని జిల్లాలోనూ.. 54 లక్షల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. 483 మంది మృతిచెందగా 140 మంది గల్లంతయ్యారు. ఆ సమయంలో ఆయన కంటిమీద కునుకు లేకుండా పరిస్థితులను పర్యవేక్షించారు. కేరళ కోలుకోవడానికి ఐదారేళ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేసినా ఏడాదిలోనే పరిస్థితులను చక్కదిద్దగలిగారు. ఓటర్లను ఆకట్టుకోగలిగారు. ఆన్‌ లైన్‌, సోషల్‌ మీడియాలో ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలతో విజయం సాధించడం బీజేపీ స్టైల్‌. ఈ విషయంలో బీజేపీ ఐటీ సెల్‌ మిగతా పార్టీలకంటే ముందుంటుంది. అయితే.. విజయ న్‌ కూడా ‘సైబర్‌ ఆర్మీ’ పేరుతో ఎల్‌ డీఎఫ్‌ తరఫున ఓ ఐటీ సెల్‌ను ఏర్పాటు చేసి బీజేపీకి చెక్ పెట్టారు.

దేశంలో మొట్టమొదటి కరొనో కేసు నమోదైంది కూడా కేరళలోనే..అయితేనేం మరణాల రేటు మాత్రం చాలా తక్కువ. ఇందుకు కారణం  కేరళ సర్కారు అందిస్తున్న వైద్యం. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ నియంత్రణలో గత ఏడాది కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు దక్కడాన్ని బట్టి, అక్కడ కరోనా వైరస్ కేర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పైనా విరుచుకుపడ్డారు. రాహుల్‌ పోరాటం చేయాల్సింది బీజేపీపై. కేరళలో మాపైన కాదు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు ప్రచారం చేస్తే బాగుంటుంది. బెంగాల్‌ లో సీపీఎంతో కాంగ్రెస్ కి వింత పొత్తు ఉంది. కానీ కేరళలో కాదని గుర్తించాలి  అని మాట్లాడారు. 
Tags:    

Similar News