చిన్న‌మ్మ‌తో రాముల‌మ్మ భేటీ - మ‌త‌ల‌బేంటి?

Update: 2019-01-05 05:34 GMT
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ‌తో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విజ‌య‌శాంతి భేటీ కావ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. వారిద్ద‌రు ఏ విష‌యంపై మాట్లాడుకున్నార‌నే దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

అక్ర‌మాస్తుల కేసులో దోషిగా తేలిన శ‌శిక‌ళ కారాగార శిక్ష అనుభ‌విస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె బెంగ‌ళూరులోని ఓ జైల్లో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో విజ‌య‌శాంతి కారాగారానికి వెళ్లి శ‌శిక‌ళ‌తో ములాఖ‌త్ అయిన‌ట్లు తాజాగా సంబంధిత జైలు అధికారులు నిర్ధారించారు.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనంత‌రం అన్నా డీఎంకేలో శ‌శిక‌ళ వ్య‌తిరేక వ‌ర్గాలంతా ఒక్క‌ట‌య్యాయి. ఆమెకు జైలుశిక్ష ఖ‌రార‌య్యాక పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని పూర్తిగ త‌గ్గించాయి. దీంతో అన్నా డీఎంకే నుంచి విడిపోయి ‘అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ’ని శశికళ స్థాపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు ఆ పార్టీ మ‌ద్ద‌తు కోరేందుకే శ‌శిక‌ళ‌ను రాములమ్మ క‌లిసిన‌ట్లు ప్ర‌స్తుతం వార్తలొస్తున్నాయి.

త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం డీఎంకే పార్టీ కాంగ్రెస్ వైపు ఉంది. కేంద్రంలో ఎవ‌రికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌న్న‌దానిపై అన్నా డీఎంకేలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అయితే - ఆ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవ‌కాశాలే ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో శ‌శికళ పార్టీ మ‌ద్ద‌తు కోసం కాంగ్రెస్ ఆరాట‌ప‌డుతోంది.

పొత్తుల‌ ప్ర‌య‌త్నాల్లో  భాగంగా కాంగ్రెస్సే రాముల‌మ్మ‌ను శ‌శిక‌ళ వ‌ద్ద‌కు పంపించింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు చాన్నాళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ప‌లుమార్లు వీరు భేటీ అయ్యారు. గ‌తంలో జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు కూడా శ‌శిక‌ళ‌ను రాముల‌మ్మ క‌లిశారు. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ శ‌శిక‌ళ వ‌ద్ద‌కు రాముల‌మ్మ‌ను దూత‌గా పంపింద‌ని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అక్ర‌మాస్తుల కేసుపై పున‌ర్విచార‌ణ జ‌రిపి శ‌శిక‌ళ‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌స్తామ‌ని విజ‌య‌శాంతి భ‌రోసా ఇచ్చి ఉండొచ్చ‌ని కూడా ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌తిపాదించిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి రాములమ్మ వ‌ద్ద శ‌శిక‌ళ ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది.


Full View

Tags:    

Similar News