మోడీ బ్యాచ్ కు ఆయుధాన్ని ఇచ్చిన రాములమ్మ

Update: 2019-08-02 10:55 GMT
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పోరాట పటిమ ఉన్నప్పటికి పార్టీ నిస్త్రాణంలో కూరుకుపోతున్న వైనంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కిందామీదా పడిపోతున్నారు. అధికారపక్షంపై పోరాడే శక్తియుక్తులు ఉన్నా.. అధినాయకత్వం నుంచి అందాల్సినంత ప్రోత్సాహం లేకపోవటంతో వారు నీరసించిపోతున్నారు. అదే సమయంలో.. తమకు మించి దూకుడును ప్రదర్శిస్తున్న బీజేపీని చూసి లోలోన రగిలిపోతున్నా.. తాము చేయలేని పనిని కమలనాథులు చేస్తున్న సంతోషం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.

ఎవరో ఒకరు గులాబీ దళాన్ని బలహీనపరిచే పని చేయటం ద్వారా.. కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టొచ్చన్న ఆశ కనిపిస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ అండ్ కోను ఎలా టార్గెట్ చేయొచ్చన్న ఐడియాల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఐడియాను బీజేపీకి ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అలియాస్ విజయశాంతి.

గ్యాంగ్ స్టర్ నయిం డైరీలో ప్రస్తావించిన పేర్లపై కేంద్రహోం శాఖ ద్వారా విచారణ జరిపించాలన్న ఐడియాను ఆమె ఇచ్చారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆరాచకాలతో పాటు.. నయింతో టీఆర్ ఎస్ నేతలు చేసిన దారుణాలు కూడా బయటకు వస్తాయన్న మాటను విజయశాంతి చెప్పటం గమనార్హం. నయిం డైరీలో పేర్కొన్నపేర్లకు సంబంధించి వివిధ మీడియాలలో వచ్చిన వివరాల్లో చాలావరకూ ఎడిటింగ్ జరిగినట్లుగా కనిపిస్తోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.

సమాచార హక్కు చట్టం ద్వారా నయింతో సంబంధాలు ఉన్న ఇతర పార్టీల నేతల పేర్ల వివరాల్ని వెల్లడించారే కానీ.. టీఆర్ ఎస్ లోని కీలక నేతల పేర్లను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే కొందరి పేర్లను మాత్రమే బయటపెట్టారని.. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ నయిం కేసును టేకప్ చేస్తే చాలా విషయాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉందంటూ ఫేస్ బుక్ లో పెట్టిన తన తాజా పోస్ట్ లో పేర్కొన్నారు.

వ్యవస్థల ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే మోడీ బ్యాచ్ కు రాములమ్మ ఇచ్చిన ఐడియా వర్క్ వుట్ కావటమే కాదు.. గులాబీ బాస్ కు ఇబ్బందే అంటున్నారు. ఇప్పటికే మోడీకి చెక్ చెప్పేందుకు సౌత్-నార్త్ సెంటిమెంట్ ను రాజేయాలని భావిస్తున్న ఆయనకు షాకిచ్చే ఏ అంశాన్ని మోడీ పరివారం వదిలిపెట్టదని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. రాములమ్మ ఇచ్చిన ఐడియా కమలనాథులకు బలమైన ఆయుధంగా మారే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News