తిక్క సీఎం.. తుగ్లక్ పాలన.. తొందరపడ్డారేమో రాములమ్మ?

Update: 2020-12-28 04:30 GMT
ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్న వారు అనూహ్యంగా తీసుకునే నిర్ణయాల వెనుక తిక్క కన్నా.. లెక్కే ఎక్కువ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే.. త్వరగా స్పందించాలనే తొందరలో ఏదో ఒక మాట అనేసే నేతలు చాలామంది ఉంటారు.  కాకుంటే.. కాస్త ‘విషయం’ ఉన్న నేతలకు తొందరపాటు ఏ మాత్రం మంచిదికాదు. దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాములమ్మ అలియాస్ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ఇప్పటివరకు అమలు చేసిన నియంత్రిత సాగు విధానాన్ని ఇకపై కొనసాగించలేమని పేర్కొన్న కేసీఆర్ నిర్ణయాన్ని తొందరపాటుతో విజయశాంతి స్పందించారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్నంతనే రియాక్టు అయిన విజయశాంతి.. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దాని సారాంశం చూస్తే.. ‘‘నియంత్రిత సాగు నిర్ణయంతో నష్టపోయిన రైతులకు ఎవరు బాధ్యులు? తల తిక్క ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయంతో తీరని నష్టం జరిగింది. ఎన్నో వైఫల్యాల తుగ్లక్ పాలనలో ఇది మరో ప్రహసనం. ఇప్పుడు రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నప్పుడు రైతు బంద్ పెట్టి ఎందుకు సతాయించావు?’’ అని ఆమె పేర్కొన్నారు.

ఇంతకాలం తాను అమలు చేసిన నియంత్రిత సాగు విధానాన్ని వెనక్కి తీసుకున్న కేసీఆర్.. కేంద్రంపై ప్రయోగించిన అస్త్రంగా పలువురు భావిస్తున్నారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా.. రైతులు నష్టపోకుండా.. ప్రభుత్వం తాను చెప్పిన మద్దతు ధరకే.. తానే ఊరికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న వైనం ఎంతో మందికి మేలు చేస్తోంది. అందుకు భిన్నంగా ఇకపై తమ ప్రభుత్వం ఆ పని చేయలేమని తేల్చేసింది. దీనికి కారణం కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టమేనని చెప్పింది.

ఇదంతా చూస్తే.. ఇదంతా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టం పుణ్యమేనని కేసీఆర్ తేల్చినట్లు చెప్పక తప్పదు. దీనిపై రైతుల్లో మోడీ సర్కారుపైన ఆగ్రహం పెరగక మానదు. ఎందుకంటే.. ఇంతకాలం తమకు మేలుగా మారిన ప్రభుత్వ కొనుగోళ్లు..ఇకపై ఉండవన్న వైనాన్ని రైతులు జీర్ణించుకోలేరన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తలతిక్కది ఎందుకు అవుతుంది? వ్యూహాత్మకంగా తీసుకున్ననిర్ణయాన్ని తలతిక్క నిర్ణయంగా అభివర్ణించిన విజయశాంతి తొందరపడ్డారన్న అభిప్రాయం కలుగక మానదు. కేసీఆర్ వ్యూహాన్ని సరిగా అర్థం చేసుకోలేని రాములమ్మ.. సీఎం కేసీఆర్ పైన నోరు జారినట్లే అని చెప్పక తప్పదు
Tags:    

Similar News