అతడు గొప్ప పోరాట యోధుడే ... కానీ, అతడిని ఓడించేందుకు వచ్చా

Update: 2021-03-13 15:30 GMT
గత కొన్ని రోజులుగా ఓటమి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియకుండా , అప్రతిహస విజయాలతో దూసుకుపోతున్న  భారత స్టార్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ రష్యాకు చెందిన అర్టిశ్‌ లాప్సన్‌ తో తలపడేందుకు రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా ఏడాదికి పైగా రింగ్‌ కు దూరమైన విజేందర్‌ ఈ నెల 19న తిరిగి బరిలో దిగనున్నాడు. గోవా సముద్ర తీరంలో క్యాసినో షిప్‌ రూఫ్‌ పై సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ విభాగంలో జరుగనున్న ఈ పోరు కోసం విజేందర్‌ రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆ ఇద్దరూ కూడా మీడియా తో మాట్లాడారు. ఏడాదిగా కఠినంగా సాగింది. నా దేహం స్పందించేందుకు కాస్త సమయం తీసుకుంది. రెండు నెలలుగా విపరీతంగా సాధన చేస్తున్నా. జై భగవాన్‌ గుడ్ ‌గావ్ లో నా శిక్షణకు సాయం చేస్తున్నాడు. బ్రిటిష్‌ ట్రైనర్‌ లీ బియర్డ్‌ సలహాలను ఆన్ ‌లైన్‌ ద్వారా తీసుకున్నా. కరోనా‌ నిబంధనల వల్ల అతడు రాలేకపోతున్నాడు. అవసరమైన ప్రతిసారీ నాకు సూచనలు చేశాడు. ఇప్పుడు జైని నా కోచ్‌ అనుకోవచ్చు. నా ప్రమోటర్ల వల్ల నా శిక్షణకు అవసరమైన మౌలిక వసతులు బాగానే ఉన్నాయి అని విజేందర్‌ అన్నాడు. ఇప్పటి వరకు విజేందర్‌ 12 ప్రొ బాక్సింగ్‌ బౌట్లలో పాల్గొనగా అన్నింట్లోనూ విజయం సాధించాడు. చివరి సారిగా అతడు 2019, నవంబర్‌లో ఘనాకు చెందిన చార్లెస్‌ అడమును ఓడించాడు.

మరోవైపు లాప్సన్ ‌కు ఆరు ప్రొ బౌట్ల అనుభవం ఉంది. అతడు సాధించిన నాలుగు విజయాల్లో రెండు నాకౌట్లే. 2020, డిసెంబర్‌లో తన సహచరుడు యూసుఫ్‌ మగోమెద్‌ బెకోవ్‌ను టెక్నికల్‌ నాకౌట్‌ తో ఓడించాడు. వరుస విజయాలు సాధిస్తున్న విజేందర్‌కు ఓటమి రుచి చూపించేందుకే తానిక్కడికి వచ్చానని లాప్సన్‌ అంటున్నాడు. ‘విజేందర్‌ గొప్ప పోరాట యోధుడు. కానీ నేనిక్కడికి అతడిని ఓడించేందుకు వచ్చాను. సొంత అభిమానుల మధ్య అతడిని నాకౌట్‌ చేయడం కన్నా మెరుగైన దారి ఇంకేం ఉంటుంది అని అన్నాడు.  ఈ పోరు కోసం నేనెంతో శ్రమించాను. శిక్షణ తీసుకున్నాను. పోరాటానికి సిద్ధంగా ఉన్నాను’ అని లాప్సన్‌ తెలిపాడు.
Tags:    

Similar News