పాద‌యాత్ర వేళ‌..సీఎం ర‌మేశ్‌ సొంతూళ్లో షాకింగ్ సీన్‌

Update: 2017-11-12 05:45 GMT
చాలా సినిమాల్లో చూసిన సీనే ఇది. ఊళ్లో బ‌ల‌మైన నాయ‌కుడు ఉంటాడు. అత‌డేం చెబితే అదే వేదం. మాట త‌ప్పితే అంతు చూస్తాన‌ని హెచ్చ‌రించ‌టం.. దానికి ఊరి జ‌నం భ‌య‌ప‌డిపోవ‌టం వ‌గైరా.. వ‌గైరా. కానీ.. అన్ని రోజులు ఒక్క‌లా ఉండ‌వు.  బ‌ల‌మైన నేత‌కు భారీ షాకిచ్చేలా జ‌నంలో చైతన్యం రావ‌టం లాంటివి సినిమాల్లో చూస్తాం. స‌రిగ్గా అలాంటి సీనే.. తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర సంద‌ర్భంగా చోటు చేసుకుంది.

హాట్ టాపిక్ గా మారిన ఈ వ్య‌వ‌హారం చూస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన బ్యాచ్ లో ముఖ్యుడు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌. టీడీపీ ఆర్థిక వ్య‌వ‌హారాల్ని చూసుకునే వారిలో ఆయ‌న పేరు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. చంద్ర‌బాబుకు ఒక చేయి సుజ‌నా అయితే.. రెండో చేయి సీఎం ర‌మేశ్ గా అభివ‌ర్ణించే వారెంద‌రో. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. సీఎం ర‌మేశ్ త‌ర‌పు ఆయ‌న‌కు చెందిన నేత‌లు కొంద‌రు  సొంతూరి జ‌నాలకు.. జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా ఎలా ఉండాల‌న్న దానిపై  బ‌ల‌మైన హెచ్చ‌రిక‌లు చేయించార‌ట‌.

ఎవ‌రూ ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తాము స్పందించ‌టం లేద‌న్న సందేశాన్ని ప్ర‌పంచానికి చాటాల‌నుకున్నార‌ట‌. ఇందులో భాగంగా  పాద‌యాత్ర‌కు ఎవ‌రూ వెళ్లొద్దు.. ఇంట్లోనే ఉండి త‌లుపులు వేసుకోండి.. లేకుంటే ఇబ్బంది ప‌డ‌తారు.. జ‌గ‌న్ ఊళ్లోకి వ‌చ్చిన వేళ వీధుల్లోకి వ‌చ్చారంటే మీ ఇష్టం అంటూ..సీఎం ర‌మేశ్ సొంతూరు పోట్ల‌దుర్తి (క‌డ‌ప జిల్లా ఎర్ర‌గుంట్ల మండ‌లంలో ఉందీ ఊరు) ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌కు స‌న్నిహితులైన  పోట్ల‌దుర్తి బ్ర‌ద‌ర్స్ గ్రామంలో  ఫ‌ర్మానా జారీ చేశార‌ట‌.

తామిచ్చిన ఆదేశాల్ని ఎవ‌రైనా ధిక్క‌రిస్తే ఇళ్ల‌ల్లో నుంచి వెళ్ల‌గొడ‌తామ‌ని బెదిరింపుల‌కు దిగారు.  పోట్ల‌దుర్తి బ్ర‌ద‌ర్స్ హెచ్చ‌రిక‌ల‌కు మౌనంగా త‌లూపిన ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాద‌యాత్ర ఊళ్లోకి వచ్చే వ‌ర‌కూ ఇళ్లల్లో నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. జ‌గ‌న్ గ్రామంలోకి అడుగుపెట్టార‌న్న విష‌యం తెలిసిన వెంట‌నే ఒకరు.. వారిని చూసి ఇంకొక‌రు.. అలా మొద‌లైన జ‌న‌చైత‌న్యం.. చివ‌ర‌కు గ్రామంలోని వారంతా జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌ద్ద‌కు చేరారు. తాము ఎదుర్కొంటున్న వార్నింగ్స్ గురించి జ‌గ‌న్ దృష్టికి తీసుకొచ్చారు.  ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప‌వ‌ర్ చేతిలో ఉన్న నేత‌లు ఎంత ప్ర‌య‌త్నించినా.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చే చైత‌న్యానికి చెక్ చెప్ప‌లేర‌ని.. ఒక‌వేళ అలా చేయాల‌ని చూస్తే.. ఎంత షాక్ త‌గులుతుంద‌న్న దానికి తాజా ఉదంతం నిద‌ర్శ‌నమ‌ని చెబుతున్నారు. 
Tags:    

Similar News