వైర‌స్‌ తో వైద్యుడి మృతి..మృత‌దేహం రాకుండా గ్రామ‌స్తుల అడ్డ‌గింత‌!!

Update: 2020-07-16 14:00 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన వైద్యులు పెద్ద సంఖ్య‌లో ప‌డుతున్నారు. వైర‌స్ నుంచి కాపాడాల్సిన వారే దానికి బ‌ల‌వుతుండ‌డంతో ఆందోళ‌న క‌లిగించే విష‌యం. అలాంటి వైద్యుల‌ను వైర‌స్‌హ‌తో చ‌నిపోతే ప్ర‌జ‌లు క‌నీసం ప‌ట్టించుకోకుండా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో వైరస్ బారిన పడి ఓ వైద్యుడు మృతిచెందితే అత‌డి మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖే‌డ్ సమీపంలోని సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు వైర‌స్ బారిన పడ్డాడు. పాజిటివ్ తేల‌డంతో అత‌డిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి‌లో చేర్పించారు. కొన్నాళ్లు చికిత్స పొందుతున్న అత‌డికి ఇటీవ‌ల ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ వార్త గ్రామ‌మంతా తెలిసింది. ఆస్ప‌త్రి నుంచి మృత‌దేహాన్ని గ్రామానికి కుటుంబ‌స‌భ్యులు.. వైద్య సిబ్బంది తీసుకొస్తుండ‌గా వారికి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. మృత‌దేహం గ్రామంలోకి తీసుకురావొద్దంటూ ఆందోళ‌న చేశారు.

వైర‌స్‌తో మృతి చెంద‌డంతో భ‌యాందోళ‌న చెందిన గ్రామ‌స్తులు డెడ్ బాడీని గ్రామలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో చివ‌ర‌కు కుటుంబ‌స‌భ్యులు గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్ర‌య‌త్నించ‌గా అక్క‌డ కూడా అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు.. వైద్య అధికారులు క‌ల్పించుకుని వారికి స‌ర్దుబాటు చేయ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. చివ‌ర‌కు అత‌డి అంత్య‌క్రియ‌లు సాఫీగా నిర్వ‌హించారు.

ఈ సంగారెడ్డి జిల్లాలో వైర‌స్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లా త‌ర్వాత సంగారెడ్డి జిల్లానే త‌ర్వాతి స్థానంలో ఉంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఒక్కరోజే 75 పాజిటివ్‌ కేసులు ఈ జిల్లాలో నమోదవ‌డం చూస్తుంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది.
Tags:    

Similar News