వైసీపీ ఎమ్మెల్యేని రానీయ‌ని ఊరి ప్ర‌జ‌లు!

Update: 2022-10-09 06:05 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోమారు విజ‌య ఢంకా మోగించాల‌ని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్క‌కు మిక్కిలిగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేరుస్తాయ‌ని ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నుంచి చోటా నేత‌ల వ‌ర‌కు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌ని వైఎస్ జ‌గ‌న్.. త‌న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్భోదిస్తున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ని వార్త‌లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివ‌రిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రాసిన లేఖ‌ను కూడా ప్ర‌జ‌ల చేతుల్లో పెడుతున్నారు. అయితే చాలా చోట్ల త‌మ‌కు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని, ల‌బ్ధిదారుల జాబితాలో త‌మ పేరు లేద‌ని.. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే తిష్ట వేశాయ‌ని.. గెలిచిన మూడున్న‌రేళ్ల త‌ర్వాత తాము గుర్తొచ్చామా అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తుండ‌టంతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిర‌వుతున్నార‌ని మీడియాలో ఇప్ప‌టికే క‌థ‌నాలు వ‌చ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక చేతులెత్తేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రికొంత‌మంది పోలీసుల‌తో త‌మ‌ను ప్ర‌శ్నించిన వారిపై కేసులు పెట్టించ‌డం, ద‌బాయించ‌డం, బెదిరించ‌డం వంటివి చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ప్ర‌కాశం జిల్లా నాగులుప్ప‌డ‌పాడు మండ‌లం క‌న‌ప‌ర్తిలో జ‌రిగింది. ఎమ్మెల్యే గారూ మా ఊరికి రావ‌ద్దు అంటూ ఊరి ప్ర‌జ‌లు నిర‌స‌న చేప‌ట్టడం విశేషం. సంత‌నూత‌ల‌పాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు నాగులుప్ప‌డ‌పాడులో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్రమం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తుల‌తోపాటు గ్రామ వైసీపీ నేత‌ల్లో కొంద‌రు ఊరికి వ‌చ్చే ర‌హ‌దారిపై నల్ల జెండాలు ప‌ట్టుకుని నిర‌స‌న చేప‌ట్టారు. ఎమ్మెల్యే గారు మా ఊరికి రావ‌ద్దు అంటూ నిన‌దించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేద‌ని గ్రామ‌స్తులు అంటున్నారు. మాట‌లు చెప్ప‌డం త‌ప్ప ప‌నులు మాత్రం కావ‌డం లేద‌ని ఆరోపించారు. రాపర్ల - చవటపాలెం రోడ్డు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కనీసం గ్రావెల్‌ రోడ్డు అయినా నిర్మించాలని ఎమ్మెల్యేకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫ‌లితం లేద‌ని వాపోయారు.

అదేవిధంగా సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో కుక్కలవారిపాలెం - కనపర్తి దారిలో బకింగ్‌హాం కాలువపై వంతెన నిర్మాణం కూడా ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్రజలకు సేవ‌లందించాల్సిన సచివాలయ సిబ్బంది గ్రామంలో ఓ నాయకుడి కనుసన్నల్లో పనిచేస్తున్నారని గ్రామ‌స్తులు విమ‌ర్శ‌లు చేశారు.

కాగా ఇప్ప‌టికే గ్రామంలో చేపట్టాల్సిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఒక‌సారి వాయిదా పడింది. ప్రస్తుతం కురుస్తున్న వ‌ర్షాల‌తో మరోసారి వాయిదా వేసినట్లు చెబుతున్నా ప్ర‌జ‌ల‌ నిరసనల‌తోనే కార్య‌క్ర‌మాన్ని మ‌రోసారి వాయిదా వేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News