వినాయక చవితి ని వదలటం లేదా ?

Update: 2021-09-07 06:54 GMT
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విషయంలో ప్రతిపక్షాలు చివరకు వినాయక చవితి పండుగను కూడా వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ నేపధ్యంలో బహిరంగంగా చవితి ఉత్సవాలను వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇంకేముంది వెంటనే బీజేపీ నేతలు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చేశారు. జగన్ హిందు వ్యతిరేకని, వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా జరుపుకోవద్దనటానికి హిందు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయటానికి ముడిపెట్టేస్తున్నారు కమలనాథులు. అదేమంటే రంజాన్ పండుగ సమయంలో ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను ఇచ్చిందా అంటు విచిత్రమైన ప్రశ్నను లేవనెత్తారు. జగన్ ఆదేశాలకు వ్యతిరేకంగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆధ్వర్యంలో నెల్లూరులో పెద్దఎత్తున ఆందోళన కూడా జరిగిపోయింది.

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనతో బీజేపీ వాళ్ళు ఎక్కడ మైలేజీ సంపాదించుకుంటున్నారో అనే ఆందోళనతో చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగేశారు. వినాయక చవితి పండుగ రోజున కోవిడ్ జాగ్రత్తలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపిచ్చేశారు. 175 నియోజకవర్గాల్లో నేతలెవరు వెనక్కు తగ్గకూడదన్నట్లుగా చంద్రబాబు పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్ ప్రభుత్వం వద్దన్నది కాబట్టి బీజేపీ, చంద్రబాబు అవునని తీరాల్సిందే.

ఇక్కడ వీర్రాజు, చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే వినాయకచవితి ఉత్సవాలను బహిరంగంగా జరపకూడదని చెప్పింది జగన్ ప్రభుత్వంకాదు. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక వీర్రాజు లేవనెత్తుతున్న రంజాన్ పండగ విషయం చూద్దాం. రంజాన్ పండుగను చవితి పండుగ లాగ ముస్లింలు గుంపులుగా ఒకచోట చేరి జరుపుకోరు. అయినా సరే మసీదుల్లో ప్రార్ధనల సమయంలో కూడా 10 మందికి మించి ఉండద్దని ఆదేశాలిచ్చిన విషయాన్ని వీర్రాజు మరచిపోయినట్లున్నారు.

ఇక్కడ అన్నింటికన్నా విచిత్రమేమిటంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలోని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లెక్కచేసేది లేదని చెప్పడం. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై కూడా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే అంటున్నారు. ఇక చంద్రబాబు పిలుపును చూస్తే కోవిడ్ నిబంధనలను అనుసరించి వినాయకచవితి పండుగ చేసుకోవటం ఆచరణ సాధ్యంకాదు. ఒకసారి గుంపు మొదలైతే దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే బీజేపీ చేష్టలను వామపక్షాలు వ్యతిరేకించటమే. చూద్దాం చివరకు వినాయకచవితి ఉత్సవాలను ఏమి చేస్తారో.
Tags:    

Similar News