బాహుబలి పేరుతో అంత మాట అనేసిందే..?

Update: 2016-04-01 04:02 GMT
రాజకీయాల్లో విమర్శలు మామూలే కానీ.. రూపాన్ని.. రంగును ప్రస్తావించి విమర్శలు చేయటం చాలా అరుదు. నిజానికి ఈ తరహా విమర్శలకు ప్రజల నుంచి సానుకూలత కూడా ఉండదు. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా సినీ నటుడు కమ్ రాజకీయ నేత విజయకాంత్ పై సినీ నటి కమ్ రాజకీయనాయకురాలు వింధ్య తీవ్ర వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశను తరచూ బయటపెట్టుకుంటూ.. ఆ పదవిని చేపట్టటమే తన లక్ష్యంగా ముందుకు నడుస్తున్న విజయ్ కాంత్ పై వింధ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు  కలకలాన్ని రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి అయ్యేందుకు విపరీతమైన ఆరాటాన్ని ప్రదర్శించే విజయకాంత్ రూపాన్ని.. రంగును.. ఆయన తీరును ప్రస్తావిస్తూ అన్నా డీఎంకే నేత వింధ్య చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ కాంత్ మాట్లాడేది ఒక పట్టాన అర్థం కాదని.. ఆయన మాటలు ఆయనకే అర్థం కాదంటూ మండిపడ్డారు. ఈ విమర్శను పెద్దగా పట్టించుకోకున్నా.. బహుబలి సినిమా ప్రస్తావన తీసుకొచ్చి చేసిన విమర్శలపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి చిత్రంలో నల్లజాతి ప్రజలు కనిపిస్తారని.. వారు అర్థం కాని భాషలో మాట్లాడి ప్రేక్షకుల్ని తికమక పెడతారని.. అదే రీతిలో విజయకాంత్ మాట్లాడుతుంటే ప్రజలు తికమక పడతారంటూ ఆమె విమర్శించారు. నల్లజాతి ప్రజలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు విజయ కాంత్ ను ఉద్దేశించి చేశారన్న విమర్శ వినిపిస్తోంది. అయినా.. ఒక పాత్రను ప్రస్తావించే సమయంలో వారి రూపాన్ని.. రంగును ప్రస్తావించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నలోనే వింధ్య వ్యూహం ఏమిటో ఇట్టేఅర్థమవుతుందని చెప్పొచ్చు. విమర్శలు చేయటం తప్పు అని చెప్పలేం కానీ.. ఆచితూచి చేయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News