కిక్కెక్కిస్తున్న వైర‌ల్ ఫిర్యాదు

Update: 2018-09-26 07:13 GMT
ప్ర‌తి సోమ‌వారం క‌లెక్ట‌రేట్ల‌లో నిర్వ‌హించే ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకొస్తుంటారు. అవినీతిపై ఫిర్యాదు చేస్తుంటారు. క‌ష్టాలు తీర్చాలంటూ మొర‌పెట్టుకుంటారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల అర్జీల‌ను స్వీక‌రించి.. వాటిపై స‌ముచిత చ‌ర్య‌ల‌కు అధికారులు ఆదేశిస్తుంటారు. ఇది ప్ర‌తివారం జ‌రిగే తంతే. అయితే, జ‌గిత్యాల క‌లెక్ట‌రేట్‌ లో ఈ నెల 24న నిర్వ‌హించిన ప్ర‌జావాణి గురించే ప్ర‌స్తుతం అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అయిల సూర్యనారాయణ(టీవీ.సూర్యం) అనే వ్య‌క్తి చేసిన ఫిర్యాదే అందుకు కార‌ణం.

ఇంత‌కీ స‌త్య‌నారాయ‌ణ‌ దేనిపై ఫిర్యాదు చేశారో తెలుసా.. మ‌ద్యం విక్ర‌యాల‌కు సంబంధించిన అంశంపై. అదేంటి? మ‌ద్యం విక్ర‌యాల‌ను నిలిపివేయాల‌ని జ‌నం త‌ర‌చుగా ఫిర్యాదు చేస్తూనే ఉంటారు క‌దా.. అందులో విశేష‌మేముంది? అనుకుంటున్నారా? ఇక్క‌డే అస‌లు మ‌త‌ల‌బు ఉంది. ఆయ‌న బాధంతా.. జ‌గిత్యాల‌లో కింగ్ ఫిష‌ర్ బీర్ల విక్ర‌యం జ‌ర‌గ‌డం లేద‌ని. మ‌ద్యం ప్రియులు - యువ‌త కింగ్ ఫిష‌ర్ బీర్ల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటార‌ని స‌త్య‌నారాయ‌ణ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. జ‌గిత్యాల‌లో మాత్రం మ‌ద్యం విక్ర‌య‌దారులు సిండికేట్‌ గా మారి ఆ బ్రాండ్ బీర్ల‌ను విక్ర‌యించ‌డం మానేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాటి స్థానంలో నాసిర‌కం బీర్ల‌ను విక్ర‌యిస్తూ మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌-19లో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని సూచించారు. ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు జ‌రిపి మ‌ద్యం వ్యాపారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన్న‌వించారు. జ‌గిత్యాల బార్లు - వైన్ షాపుల్లో కింగ్ ఫిష‌ర్ బీర్ల విక్ర‌యాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. ఆయ‌న ఫిర్యాదు చూసి అధికారులతోపాటు అక్క‌డున్న‌వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. సంబంధిత ఫిర్యాదుపై విచార‌ణ జ‌ర‌పాల్సిందిగా అబ్కారీ అధికారుల‌ను ఉన్న‌తాధికారులు ఆదేశించారు.


Tags:    

Similar News