సొంతింట విమర్శలు.. పొరుగింట ప్రశంసలు.. కోహ్లి దిగ్గజ కెప్టెనేనా?

Update: 2022-01-30 11:56 GMT
కోహ్లీ.. గంగూలీ, ధోనీల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు.. ఇయాన్‌ ఛాపెల్‌ విరాట్ ను దిగ్గజ కెప్టెన్లతో పోల్చలేం.. సంజయ్‌ మంజ్రేకర్‌ టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి విషయంలో దాదాపు ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ఇందులో మంజ్రేకర్ భారతీయుడే. ఇయాన్ ఛాపెల్ ఆస్ట్రేలియన్. విదేశీ క్రికెటరేమో కోహ్లిపై ప్రశంసలు కురిపిస్తే.. స్వదేశీ క్రికెటరేమో తక్కువ చేసి చూపాడు. ఇది పక్కనపెడితే.. అసలు విరాట్ దిగ్గజ కెప్టెనేనా? కాదా? అన్నది కొంత కాలంగా చర్చల్లో ఉన్నది. విజయాలు అందులోనూ విదేశీ గడ్డపై సాధించినవి, ఐసీసీ ట్రోఫీల్లో గెలుపు ఏ కెప్టెన్ రికార్డును విశ్లేషించేందుకైనా ప్రామాణికం. ఈ కోణంలో చూస్తే కోహ్లిని దిగ్గజ కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే అతడి సారథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది. ఇంగ్లండ్ లోనూ గెలిచినంత పనిచేసింది. టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరింది. స్వదేశంలో అయితే తిరుగే లేదు. దీంతోనే కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ ఛాపెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడని, ఏడేళ్ల పాటు భారత జట్టును సమర్థవంతంగా నడిపించాడని కొనియాడాడు. 'టీమ్‌ఇండియాకు కోహ్లీ విజయవంతమైన సారథి. అతడు జీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక విషయం ఆందోళన కలిగించింది.

అతడికున్నఅమితమైన ఉత్సాహం నాయకుడిగా తన నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా..? అని అనిపించింది. అయితే, కెప్టెన్‌గా కోహ్లీ మిన్నగా రాణించి జట్టును విజయవంతంగా నడిపించాడు. తన అత్యుత్సాహాన్ని తగ్గించుకోలేదు. కానీ, టీమ్‌ఇండియాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లాడు. ఇంతకుముందు ఏ సారథీ చేయలేని విధంగా.. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానెతో కలిసి జట్టును విదేశాల్లో సైతం విజయాల బాటపట్టించాడు' అని ఛాపెల్‌ కొనియాడాడు. '2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటన, 2021లో ఇంగ్లాండ్‌ పర్యటన.. కోహ్లీ కెరీర్‌లో అత్యుత్తమ విజయాలు. ఇక స్వదేశంలో ఎలాగూ భారత్‌ ఎదురులేనిదే. అతడు గంగూలీ, ధోనీల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడేళ్ల పాటు జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే, ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ కోల్పోవడమే అతడికి తీవ్ర నిరాశ కలిగించేది. తొలి టెస్టులో విజయం సాధించినా సిరీస్‌ కోల్పోవడం బాధాకరం. అతడికున్న గొప్ప విశేషం ఏంటంటే.. ఆటగాళ్లలో టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచడం. అతడికి టెస్టుల్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. దానికోసం ఎంతోప్రయత్నించాడు.

అలాగే రిషభ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దిన విధానం కూడా అద్భుతం. యువ ఆటగాడికి అతడిచ్చిన మద్దతు అమూల్యమైనది' అని ఛాపెల్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, ఛాపెల్ వాదన ఇలా ఉంటే.. కోహ్లీపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆల్ టైమ్ గ్రేట్‌ భారత కెప్టెన్లలో ఒకడిగా అతడిని పరిగణించలేమని పేర్కొన్నాడు.

టీమ్ఇండియాకు గతంలో సేవలందించిన కెప్టెన్లతో పోల్చితే కోహ్లీ ఐసీసీ ట్రోఫీలు సాధించడంలో విఫలమయ్యాడని అన్నాడు. కానీ, ఆటగాడిగా మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడని అభిప్రాయపడ్డాడు. 'భారత దిగ్గజ కెప్టెన్లలో మహేంద్ర సింగ్‌ ధోని ఒకడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు సాధించిన విజయాలు, ఐసీసీ ఈవెంట్లలో సొంతం చేసుకున్న కప్పుల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నాను. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అంత ఒత్తిడి ఉండదు. కానీ, ఐసీసీ ఈవెంట్లలో చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా ధోని గొప్పగా జట్టుని నడిపించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌,2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్‌ని విజేతగా నిలిపాడు. అందుకే, మనం ఆల్‌టైమ్ గ్రేట్‌ కెప్టెన్ల గురించి మాట్లాడేటప్పుడు ధోనిని విస్మరించడం అన్యాయం. అలాగే, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత జట్టుని తక్కువగా అంచనా వేసే కాలంలో కపిల్ దేవ్‌ ప్రపంచకప్‌ సాధించి సత్తా చాటాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తర్వాత సౌరవ్‌ గంగూలీ విదేశాల్లో కీలక విజయాలు సాధించాడు. భారత్‌పై ఉన్న అపకీర్తిని తొలగించి కాస్త ఊరట కలిగించాడు. సునీల్ గావస్కర్‌ కూడా జట్టుని మెరుగ్గా నడిపించాడు. అందుకే, వీళ్లంతా గొప్ప సారథులయ్యారు'అని మంజ్రేకర్ చెప్పాడు. 'వాళ్లతో పోల్చుకుంటే, విరాట్‌ కోహ్లీలోనూ చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సారథిగా పోరాట స్ఫూర్తితో జట్టును నడిపించాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వాండరర్స్‌ టెస్టులో ఓ వైపు వికెట్లు పడుతున్న కోహ్లీ గొప్పగా పోరాడాడు. ఈ సిరీస్‌లో భారత్‌ 1-2 తేడాతో ఓటమి పాలైనా విరాట్‌ ఆటను తక్కువ అంచనా వేయలేం. అతడు ఎప్పుడూ ఓటమిని అంత సులభంగా అంగీకరించడు. ఆఖరి వరకు విజయం కోసం పోరాడుతాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ అతడు గొప్పగా పోరాడాడు. చివరి నిమిషం వరకు మ్యాచ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అయినా దురదృష్టవశాత్తు జట్టుని విజేతగా నిలుపలేకపోయాడు. ఐసీసీ  ఈవెంట్లలో కూడా కోహ్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా గొప్పగా రాణిస్తున్న కోహ్లీ.. అంతర్జాతీయ స్థాయి కప్పులు సాధించడంలో విఫలమయ్యాడు. అందుకే అతడిని ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ భారత కెప్టెన్లలో ఒకడిగా పరిగణించలేము' అని పేర్కొన్నాడు.

కప్పులే కొలమానమా? వీరిద్దరి వాదనలను పక్కనపెడితే కోహ్లీ భారత దిగ్గజ కెప్టెన్లలో ఒకడనడంలో సందేహమే లేదు. టీమిండియా ఇతడి సారథ్యంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్, 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. అంటే కప్ నకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఆ రోజు లక్ మనవైపు ఉండుంటే మన జట్టు చాంపియన్ అయి ఉండేదని తెలుస్తోంది. కేవలం ఒకే ఒక రోజు మనది కాలేదు. అంతే తేడా. ఉదాహరణకు.. 2019 ప్రపంచ కప్ సెమీస్. ముందురోజు వర్షం కురవకుంటే టీమిండియాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ, వాన వచ్చాక అంతా మారిపోయింది. మరోవైపు కోహ్లి 2014 నుంచి టెస్టు కెప్టెన్ గా ఉన్నాడు. అప్పటినుంచి ధోని టెస్టుల్లో ఆడలేదు. అంటే.. దిగ్గజ క్రికెటర్ లేకున్నా.. జట్టును విరాట్ సమర్థంగా నడిపాడని తెలిసిపోతుంది.

వన్డేల్లోనూ రెండేళ్లుగా ధోని లేకుండానే టీమిండియా రాణిస్తోంది. మరి ఇన్నేళ్లలో అతడు సాధించిన సిరీస్ లు, కప్ లు వట్టిగా వచ్చినవేనని కొట్టిపారేయలేముగా..? ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమంటే.. కోహ్లిని దిగ్గజ కెప్టెన్ గా చెప్పలేమన్న మంజ్రేకర్ కు నోరుజారిమాట్లాడతాడనే పేరుంది. వన్డే ప్రపంచ కప్ సందర్భంగా జడేజానుద్దేశించి అతడిలాగే బిట్స్ అండ్ పీస్ అని వ్యాఖ్యానించి నాలుక్కర్చుకున్నాడు. ఈ లెక్కన చూస్తే ఇయాన్ ఛాపెల్ స్థాయి పెద్దదే. ఆస్ట్రేలియా లాంటి జట్టుకు 75 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన అతడు 5,345 పరుగులు చేశాడు. భారత్ కు 37 టెస్టులాడిన మంజ్రేకర్ చేసింది 2,034 పరుగులే.
Tags:    

Similar News