క్రికెట్‌ ఆడటం మానేస్తా .. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-11-09 08:30 GMT
నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ తో టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2021లో నమీబియాతో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ పొట్టి ఫార్మాట్ క్రికెట్‌ లో ఆటగాడిగా మాత్రమే టీమ్ ఇండియాలో భాగం కానున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఓ విషయంపై చాలా విషయాలు వెల్లడించాడు. అదే పనిభారం. విరాట్ మ్యాచ్ అనంతరం కాన్ఫరెన్స్‌లో వర్క్‌లోడ్‌పై స్పందించాడు.

తన పనిభారంపై మాట్లాడేందుకు ఇదే సరైన సమయం అని , గత త 6-7 ఏళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తాను నిరంతరం మైదానంలో ఉండాల్సి వచ్చిందని, అది తన శరీరంపై ప్రభావం చూపుతోందని తెలిపాడు. అయితే ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత పనిభారాన్ని తగ్గుతుందని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నా. కెప్టెన్‌గా ఉండటం నిజంగా గొప్ప గౌరవం. అయితే, పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. గత ఆరేడేళ్లుగా అధిక పనిభారం, ఒత్తిడి ఉంది. అయినా, మా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ టోర్నీలో మాకు అనుకున్న ఫలితాలు రాలేదని తెలుసు.

కానీ, బాగానే ఆడాము అనుకుంటున్నాం. టీ20 క్రికెట్‌ భిన్నమైంది. మొదటి రెండు ఓవర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో వారి అధిపత్యం కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్‌ లలో మేం ఇదే మిస్సయ్యాం. ఇది వరకు చెప్పినట్లుగానే ఆ మ్యాచ్‌ లలో మేము తెగించి ఆడలేకపోయాం. అది నిజంగా కఠిన సమయం. రవి భాయ్‌, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా వారు గొప్పగా పనిచేస్తున్నారు. ఆటగాళ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా కృషి చేశారు. ఇంకో మాట, ఇకపై కూడా మునుపటి దూకుడు కొనసాగుతుంది. ఆ దూకుడే గనుక చూపనినాడు నేను క్రికెట్‌ ఆడటం మానేస్తాను. కెప్టెన్‌ కాకముందు కూడా జట్టు విజయాలలో నా వంతు పాత్ర పోషించాను. అలాగే ముందుకు సాగుతానని చెప్పాడు.

భారత జట్టు టీ20 సారథిగా తనకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కోచ్‌లు, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై పూర్తిస్థాయిలో బ్యాటర్‌గా తన సేవలు అందిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌ కప్‌-2021 టోర్నీలో భాగంగా టీమిండియా నవంబరు 8న తమ చివరి మ్యాచ్‌ ఆడింది. టీ20 ప్రపంచకప్‌ లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగిన కోహ్లి సేన, కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నమీబియాతో నామమాత్రపు మ్యాచ్‌ లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Tags:    

Similar News