ప్రపంచంలో మూడో బెస్ట్ స్మార్ట్ సిటీగా విశాఖ

Update: 2020-11-19 17:43 GMT
అంతర్జాతీయ స్థాయి రాజధాని అయ్యేందుకు విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు అన్ని వనరులున్నాయని, అందుకే పాలనా రాజధానిగా నిపుణులు, సీఎం జగన్ దీనిని ఎంపిక చేశారని అంటోన్న సంగతి తెలిసిందే. వారి అంచనాలకు తగ్గట్టుగానే విశాఖ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. వివిధ దేశాల్లోని 20 మేటి నగరాలతో పోటీపడిన విశాఖకు అరుదైన గౌరవం దక్కించుకుంది. స్పెయిన్‌లో జరిగిన ‘స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2020’లో ‘లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు’ కేటగిరీలో మూడో స్థానం దక్కించుకుంది. మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టులతో ఈ అవార్డు కోసం ప్రపంచంలోని 20 మేటి నగరాలు పోటీ పడ్డాయి. విశాఖ బీచ్‌ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్‌ ఎబిలిటీ పార్క్‌’ లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డుకు పోటీ పడి మూడో స్థానం దక్కించుకుంది. మొత్తం ఏడు కేటగిరీల్లో ఈ అవార్డుల కోసం ప్రపంచంలోని 46 నగరాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తొలి స్థానం బ్రెజిల్‌ దక్కించుకోగా, టర్కీలోని ఇస్తాంబుల్‌ రెండో స్థానంలో నిలిచింది.

బీచ్‌ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా రూ.3.50 కోట్లతో ఆల్‌ ఎబిలిటీ పార్క్‌ తీర్చిదిద్దామని, సాధారణ ప్రజలు, పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ పార్కులో ఆటలాడుకోవచ్చని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. దేశంలో ఈ తరహా పార్క్ విశాఖలో మాత్రమే ఉందని, దానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్‌ ఇదేనని, అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News