విశాఖ లోక్‌ సభలో వారికే మొగ్గు.?

Update: 2019-04-12 09:28 GMT
విద్యావంతులు - మేధావులు ఉన్న జిల్లా అది. ఆ జిల్లాలో రాజకీయ ఉద్దండులైన పురంధేశ్వరి - రాజకీయ నేపథ్యం ఉన్న భరత్‌ - వ్యక్తిగత ఇమేజ్‌ తెచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణలు బరిలో నిలిచారు. దీంతో వీరి మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ అన్నట్లు సార్వత్రిక పోరు ఇంట్రెస్ట్‌ గా సాగింది. ఏపీ రాష్ట్రంలో కొన్ని చోట్ల ద్విముఖ పోరు - మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు సాగింది. కానీ ఉత్తరాంధ్రలో కీలక జిల్లా అయినా విశాఖ లోక్‌ సభ నియోజకవర్గంలో అన్ని పార్టీల నుంచి ఉద్దండులు బరిలో ఉండడంతో పోరు ఆసక్తిగా మారింది. ప్రతీ పార్టీలో ఏదో రకంగా వ్యక్తిగతంగా ఇమేజ్‌ ఉన్నవారు పోటీలో ఉండడంతో ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

విశాఖ లోక్‌ సభ నియోజకవర్గంలో లోక్‌ సభ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు బరిలో ఉన్నారు. మొదట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఈ స్థానం టికెట్‌ పై తీవ్ర కసరత్తు చేశారు. మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఈ స్థానాన్ని పెండింగ్‌ లో ఉంచడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే బాలకృష్ణ భరత్‌ కోసం ఒక రకంగా పైరవీలు చేపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ తరువాత నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించిన తరువాత భరత్‌ కు టికెట్‌ కన్ఫామ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరి దాదాపు అందరికీ సుపరిచితమే. మొదట్లో కాంగ్రెస్‌ లో కొనసాగిన పురంధేశ్వరి ఆ తరువాత బీజేపీలోకి మకాం మార్చారు. ఆ పార్టీనే నమ్ముకొని విశాఖ లోక్‌ సభ టికెట్‌ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ కూతురిగా తనపై ఉన్న అభిమానం - బీజేపీపై ఉన్న మమకారం తనకు కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. పైగా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం  నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్‌ రాజు ప్రాతినిథ్యం వహించారు. దీంతో జిల్లాలో బీజేపీకి కొంత పట్టు సాధించింది. ఇక ఇటీవల ప్రధానమంత్రి మోదీ విశాఖలో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కేంద్రంలో బీజేపీ వస్తే ఇక్కడ పురంధేశ్వరి గెలిస్తే మంత్రి పదవి ఖాయమంటున్నారు. దీంతో ఈ సీటు తనకే కన్ఫామ్‌ అన్నట్లు గా పురంధేశ్వరి భావిస్తున్నారు.

వైఎస్‌ ఆర్‌ సీపీ అభ్యర్థిగా ఎంవీవీఎస్‌ సత్యనారాయణ బరిలో ఉన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖ జిల్లాలో ఈసారి జగన్‌ ప్రత్యేక దృష్టిని సాధించారు. ఎందుకంటే ఈ జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయి. కేవలం మూడు సీట్లు సాధించిన వైఎస్‌ ఆర్‌ సీపీ నేత జగన్‌ తల్లి విజయమ్మను గెలిపించుకోలేకపోయారు. దీంతో విద్యావంతుడైన ఎంవీవీఎస్‌ సత్యానారాయణను బరిలో ఉంచి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు.

ఇక సామాజిక వర్గంతో పాటు వ్యక్తిగత ఇమేజ్‌ ఉన్న జేడి లక్ష్మీనారాయణను విశాఖ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది జనసేన. విశాఖ జిల్లాలో సీట్లు సాధిస్తామని నమ్మకం పెట్టుకున్న లోక్‌ సభ నియోజకవర్గంపై గ్యారంటీగా లెక్కలు వేసుకుంటోంది. సీబీఐ జేడీగా ఆయన చేసిన ప్రభంజనం మాములు విషయం కాదు. దీంతో పవన్‌ ఈ సీటు గ్యారంటీ అనుకుంటున్నారు. మరోవైపు టీడీపీ - బీజేపీలో చీలిన ఓట్లు జనసేనకే వస్తాయని ఆశాభావంతో ఉన్నారు.

మొత్తంగా విశాఖ జిల్లాలో పోరు టైట్‌ గానే కొనసాగింది. ప్రస్తుతానికి టీడీపీ - జనసేన మధ్య ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనే ఆసక్తి నెలకొంది. వైసీపీ మధ్యలో ఎన్ని ఓట్లు చీలిస్తే అంత నష్టం జరుగుతుంది. పురంధేశ్వరీ బీజేపీకి ఎక్కువగా ఆశలు పెంచుకున్నా నెరవేరేలా కనిపించడం లేదు. విశాఖ పార్లమెంట్ లో ఈసారి టీడీపీ లేదా జనసేన గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఓటింగ్ ను బట్టి తెలుస్తోంది.  అయితే ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలో భద్రపరిచారు.  దీంతో ఎవరివైపు మొగ్గు చూపారనేది 23న తేలాల్సి ఉంది. దీంతో ఇక్కడి ఉద్దండులల్లో ఎవరు గెలుస్తారోనన్న ఆసక్తి నెలకొంది.
 



Tags:    

Similar News