విశాఖలో ప్రోటోకాల్ రగడ.. టీడీపీ ఫ్లోర్ లీడర్ ను తోసేసి కొట్టేశారు

Update: 2022-07-28 10:40 GMT
ఎంత అధికారపక్షమైనా.. విపక్షానికి కాస్తంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది.ప్రజాస్వామ్యంలో ఎంత బలమైన విపక్షం ఉంటే అంత మంచిదన్న భావన అధికారపక్షంలో ఉండేది. మారిన రాజకీయాల్లో అలాంటివి ఎక్కడా కనిపించని పరిస్థితి. ఆ మాటకు వస్తే అధికారంలో ఎవరు ఉన్నా సరే.. విపక్షం అన్నది నామరూపాల్లేకుండా ఉండాలన్నట్లుగా అధికారపక్ష నేతల తీరు కనిపిస్తోంది.

అధికార పక్షమే మొత్తంగా కనిపించాలే కానీ.. తమను వ్యతిరేకించేవారు.. తమను ప్రశ్నించే వారి ఉనికిని అధికారపక్షీయులు అస్సలు భరించలేకపోతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలోని విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

విశాఖపట్నంలోని 26వ వార్డు సంఘం ఆఫీసు కూడలి డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గొలగాని వెంకట హరికుమారి.. వైసీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

అయితే.. ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం జరగలేదంటూ టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ప్రోటోకాల్ ను విస్మరించిన వైనంపై టీడీపీ ప్లోర్ లీడర్ పేల శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో అక్కడ వాతావరణం వేడెక్కటమే కాదు.. వైసీపీ నేతలు పలువురు పేల శ్రీనును తోసేశారు. దీంతో అతను కిందపడ్డారు. ఆయనపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అతడి చేతికి ఉన్న విలువైన వాచ్ కూడా ధ్వంసమైంది.

పాత సినిమాల్లో మాదిరి అంతా అయిపోయాక ఎంట్రీ ఇచ్చే పోలీసులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఖాకీలు ఎంట్రీ ఇచ్చారు. జరగాల్సిందంతా జరిగే వరకు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి.. తమపై దాడి చేశారంటూ టీడీపీనేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. అధికార వైసీపీ నేతలకే పోలీసులు సహకారం అందించారని.. టీడీపీ నేతల్ని అడ్డుకునేందుకు రోప్ వేయటాన్ని తప్పు పట్టారు. ఈ రగడ విశాఖ రాజకీయాల్ని మరింతగా వేడెక్కించింది.
Tags:    

Similar News