సినీపరిశ్రమలను తాకిన కావేరీ జల వివాదం!

Update: 2016-09-12 04:28 GMT
కావేరి నదీ జలాల విషయంలో.. తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక భగ్గుమంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగి.. గత శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ ను కూడా చేపట్టాయి. ఈ బంద్ లో అన్ని సంఘాలతో పాటు కన్నడ సీనీరంగం కూడా చాలా యాక్టివ్ పాల్గొంది. అయితే ఈ విషయంలో తమ రాష్ట్ర ప్రభుత్వానికి తాము కూడా అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు తమిళసినీ జనాలు.

కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి - అమ్మ జయలలిత తీసుకునే చర్యలకు తాము పూర్తి అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. సీఎం జయలలితను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన శాండిల్‌ వుడ్ నటుల తీరును ఖండించిన వీరు.. తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పయనం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడూ అటు కోలీవుడ్ - శాండిల్ వుడ్ నటుల మధ్య కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఇది కేవలం కావేరీ జలాల విషయం వరకూ మాత్రమే ఉంటుందనే క్లారిటీ వారికి ఉన్నట్లే తెలుస్తుంది.
 
ఈ విషయాలపై స్పందించిన విశాల్.. తమిళ ప్రజల దాహార్తి తీర్చడానికి - రైతులకు వ్యవసాయానికి నీరు అందించడానికి అమ్మ జయలలిత తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని పేర్కొన్నారు. ఒక్కసారి సుప్రీం స్పష్టమైన తీర్పును ఇచ్చిన తర్వాత కూడా కర్ణాటకకు చెందిన వారు ఆందోళనకు దిగడం సరైన చర్య కాదన్న విశాల్.. ఈ వ్యవహారంలో కన్నడ నటుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏది ఏమైనా.. కావేరి జలాల విషయంలో అమ్మ ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తాము పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించారు.
Tags:    

Similar News