బాబు ప‌రువు తీసే ప్ర‌క‌ట‌న చేసిన బీజేపీ సీనియ‌ర్‌

Update: 2017-07-12 16:49 GMT
ఇటీవ‌ల ఏపీలో పెరిగిపోతున్న అవినీతిపై బ‌హిరంగంగానే గ‌ళం విప్పుతున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు త‌న ఆందోళ‌న రూటు మార్చారు. మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ అధికారంలో ఉన్నప్ప‌టికీ అవినీతి విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌న్న‌ట్లుగా విష్ణుకుమార్ రాజు స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. లంచావతారాలను పట్టిస్తే పదివేల నజరానా! పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వినడానికి విచిత్రమైన ప్రకటనగానే ఉండచ్చు. కానీ నిజంగా నిజం.. జిల్లాలో పెరిగిపోతున్న లంచావతారాల భరతం పట్టించేందుకు విష్ణుకుమార్ రాజు ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

విశాఖ భూ కుంభకోణంలో చేతివాటం ప్రదర్శించి, ఒక తహశీల్దారు - అచ్యుతాపురం తహశీల్దారు - ఆర్ అండ్ బి ఇంజినీర్ ఇన్ చీఫ్‌ అవినీతిపై విష్ణుకుమార్ రాజుకు ఫిర్యాదులు అందడంతో ఆయనే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించారన్న ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడులు జరిపితే, వందల కోట్ల అక్రమార్జన బయటపడింది. ఇదిలా ఉండగా ఇంటి ప్లాన్ కోసం ఓ వ్య‌క్తి టౌన్ ప్లానింగ్ ఉద్యోగిని ఆశ్రయిస్తే, ఆయన 40 వేల రూపాయలు లంచం అడిగాడు. ఈ విషయాన్ని వెంకటరెడ్డి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో చైన్‌మెన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నించిన విష్ణుకుమార్ రాజు కొత్త ప్ర‌క‌ట‌న చేశారు.

గ‌తంలో వ‌లే ఇక‌పై కూడా తాను జిల్లాలో అవినీతి అధికారులను వదిలిపెట్టనని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అలాగే అవినీతి అధికారుల వివరాలు స్పష్టంగా తనకు తెలియచేస్తే, ఏసీబీ దాడులు చేయిస్తానని, సమాచారం తనకు ఇచ్చిన వారికి 10 వేల రూపాయల నజారానా కూడా ఇస్తానని ప్రకటించారు. టౌన్‌ప్లానింగ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేసిన వెంకటరెడ్డికి రెండు రోజుల్లో పది వేల రూపాయలు ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు. మిత్ర‌ప‌క్షం శాస‌న‌స‌భాప‌క్ష‌నేత చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌భుత్వం ప‌రువు తీసేలా ఉందని ప‌లువురు తెలుగుత‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతున్న‌ట్లు విశాఖ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News