విష్ణుదీ వీర్రాజు మాటే!...బాబుకు ద‌బిడిదిబిడే!

Update: 2018-01-28 15:30 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు నిజంగానే కంటి మీద కునుకు ప‌డే ప‌రిస్థితే క‌నిపించ‌డం లేదు. మొన్న‌టిదాకా అస్స‌లు అపాయింట్ మెంటే ఇవ్వ‌కుండా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముప్పుతిప్ప‌లు పెడితే.. బీజేపీకి చెందిన ఏపీ నేత‌లు వ‌రుస‌గా త‌న‌పై సంధిస్తున్న విమ‌ర్శ‌లు బాబును నిజంగానే తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే నాన్ స్టాప్‌గా బాబుపైనా, ఆయ‌న పాల‌న‌పైనా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... నిన్న అక‌స్మాత్తుగా స్వ‌రం మార్చేసి బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో కాస్తంత ఖుషీ అయిన చంద్రబాబు ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చేసిన‌ట్టేన‌ని భావించి... బీజేపీతో మైత్రిపై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అంతే తెల్లార‌గానే మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చిన సోము... బాబుపై త‌న పాత స్వరాన్ని మ‌రింత గాఢ‌త పెంచేసి వినిపించారు. దీంతో ఒక్క‌రోజులోనే వీర్రాజులో ఇంత మార్పెలా వ‌చ్చింద‌ని టీడీపీ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుంటే... మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా ఇప్పుడు వీర్రాజుకు తోడుగా బీజేపీ నేత‌, విశాఖ జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విష్ణు కుమార్ రాజు రంగంలోకి దిగిపోయారు.

మొన్న ఏపీ అసెంబ్లీకి వ‌చ్చిన రాజుగారు.. అక్క‌డ ప్ర‌జాపద్దుల క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న వైసీపీ యువ నేత బుగ్గ‌న రాజేంద్ర‌నాధ‌రెడ్డితో క‌లిసి క‌నిపించారు. అంతేకాకుండా బుగ్గ‌న‌తోనే ఆయ‌న కార్యాల‌యానికి వెళ్లిన రాజు... అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు అండ్ కోకు ఆగ్ర‌హం తెచ్చేలా కామెంట్లు చేశారు. వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి... టీడీపీలో చేరిన 22 మందిలో ఓ న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డంపై గ‌ళం విప్పిన రాజు... చంద్ర‌బాబు చేసింది త‌ప్పేన‌ని, వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని మంత్రులుగా ఎలా చేర్చుకుంటార‌ని ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే వారి చేత రాజీనామాలు చేయించాల‌ని, లేనిప‌క్షంలో పార్టీ ఫిరాయించిన వారిని మంత్రులుగా చేర్చుకున్నా త‌ప్పులేద‌ని రాజ్యాంగానికి స‌వ‌ర‌ణ‌లు చేయించాల‌ని డిమాండ్ చేశారు. రాజు గారు ఈ వ్యాఖ్య‌లు చేసిన స‌మ‌యంలో చంద్ర‌బాబు దావోస్‌లో ఉన్నా ఇక్క‌డే ఉన్న తెలుగు త‌మ్ముళ్లు మాత్రం ఆయ‌నపై ఎదురు దాడికి దిగారు. అయితే రాజుగారు కూడా స‌ద‌రు తెలుగు త‌మ్ముళ్ల‌పై త‌న‌దైన శైలిలో ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ... ఎవ‌రు నీతి త‌ప్పిన వారంటూ కాస్తంత హీట్ పెంచేశారు.

ఆ త‌ర్వాత ఈ వివాదం స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటున్న త‌రుణంలో నేటి మ‌ధ్యాహ్నం విశాఖ‌లో మీడియా ముందుకు వ‌చ్చిన విష్ణు... మ‌రోమారు చంద్ర‌బాబు చేసిన త‌ప్పును ప్ర‌స్తావించారు. నాడు తాను బుగ్గ‌న వెంట వెళ్ల‌డంలో ఏం త‌ప్పుంద‌ని ప్ర‌శ్నించిన రాజు గారు... వైసీపీ కార్యాల‌యం ద‌గ్గ‌ర‌లో ఉన్నందునే అక్క‌డికి వెళ్లాన‌ని చెప్పారు. అయినా త‌ప్పులు మీరు చేసి... త‌న‌ను త‌ప్పు చేసిన వాడిలా ఎలా చెబుతార‌ని కూడా మండిప‌డ్డారు. పార్టీ ఫిరాయించిన వారిని మంత్రులుగా చేర్చుకున్న చంద్ర‌బాబుది త‌ప్పు అని తాను చేసిన ప్ర‌క‌ట‌న‌ను మాత్రం తాను వెన‌క్కు తీసుకోవ‌డం లేద‌ని కూడా విష్ణు మ‌రోమారు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మొత్తానికి వీర్రాజు ఓ వైపున పొడుస్తుంటే... మ‌రోవైపున విష్ణు కూడా సూదితో పొడుస్తూ బాబుకు నిజంగానే బీపీ పెంచేస్తున్నార‌న్న మాట‌.
Tags:    

Similar News