అచ్చెన్నా... కోరి మ‌రీ తిట్టించుకున్నారే!

Update: 2018-01-26 07:37 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌గా - శ్రీ‌కాకుళం జిల్లాలో ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా నిలిచిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు విప‌క్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఏ స్థాయిలో లేస్తారో వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఒక్క జ‌గ‌నే కాకుండా త‌న పార్టీకి వ్య‌తిరేకులుగా ఎవ‌రున్నా కూడా అచ్చెన్న ముందు నిల‌బ‌డ‌టం దాదాపుగా దుర్ల‌భ‌మ‌నే చెప్పాలి. గ‌ట్టి స్వ‌రం - సూటిగా మాట్లాడే నైజం అచ్చెన్న‌ను పార్టీకి వీర విధేయుడిగా మార్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఇప్పుడు అచ్చెన్న ల‌క్ష‌ణాల గురించి - ఆయ‌న గొప్ప‌త‌నం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వ‌చ్చిందంటే... గ‌తంలో ఎలా ఉన్నా... ఈ ద‌ఫా అచ్చెన్న కోరి మ‌రీ త‌న‌ను తాను తిట్టించేసుకున్నారు. అది కూడా మిత్ర‌ప‌క్షానికి చెందిన నేత‌తోనే. అచ్చెన్న తూటాల్లాంటి మాట‌ల‌కు అసెంబ్లీలో జ‌గ‌న్ కూడా ఓ రేంజిలో టీడీపీపై విరుచుకుప‌డుతున్న వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. అయితే అటు స‌భ‌లోనూ ఇటు బ‌య‌టా టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే - ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు.. ఇప్పుడు అచ్చెన్న‌కు నిజంగానే వైట్ వాష్ చేసేశార‌ని చెప్పాలి.

అస‌లు ఏదో ఒక కార‌ణం లేకుండా ఇత‌రుల‌పై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో రాజుగారు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటార‌నే చెప్పాలి. మొన్న అసెంబ్లీలో పీఏసీ చైర్మ‌న్‌, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వ‌ద్ద‌కెళ్లి... మీడియాతో మాట్లాడారు. బుగ్గ‌న చాంబ‌ర్‌ లోనే జ‌రిగిన ఈ ప్రెస్‌ మీట్‌ లో బుగ్గ‌న కంటే కూడా రాజుగారే చాలా విష‌యాలు మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్ర‌స్తావించిన రాజు.. వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలో చేరిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం స‌రికాద‌ని, వారి చేత రాజీనామాలు చేయించి తిరిగి గెలిపించుకుని అప్పుడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చుకుంటే బాగుంటుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. లేని ప‌క్షంలో పార్టీ ఫిరాయించిన వారికీ మంత్రి ప‌ద‌వులు ఇచ్చినా త‌ప్పులేద‌ని రాజ్యాంగానికి స‌వ‌ర‌ణ అయినా చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు అంతెత్తున ఎగిరిప‌డ్డారు. మిత్ర‌పక్షంగా ఉండి కూడా విప‌క్షంతో క‌లిసి మీడియా స‌మావేశాలు పెట్టడం, అధికార కూట‌మిపై నింద‌లు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని టీడీపీ నేతలంతా క‌ట్ట క‌ట్టుకుని మీడియా ముందు వాలిపోయారు. ఇదే రీతిన మీడియా ముందుకు వ‌చ్చిన అచ్చెన్న... నిన్న తిరుప‌తితో రాజుగారిపై ఓ రేంజిలో ఫైర‌య్యారు. రాజు గారు రోజుకో మాట మాట్లాడే నేత అంటూ కాస్తంత నోరు జారిపోయారు.

అంతే... తెల్లారిందో, లేదో విష‌యం తెలుసుకున్న రాజు గారు కూడా అచ్చెన్న‌పై ఎదురు దాడికి దిగిపోయారు. వ‌చ్చీరాగానే అచ్చెన్న వైఖ‌రిపై నిప్పులు చెరిగిన రాజు గారు... అస‌లు మాట మాట్లాడే ముందు... ముందూ వెనుకా చూసుకోవాల్సిన ప‌నిలేదా? అంటూ అచ్చెన్న‌కు వైట్ వాష్ చేశార‌నే చెప్పాలి. పూటకో మాట మాట్లాడుతున్నానని చెబుతున్న అచ్చెన్న‌... తాను ఎప్పుడు మాట మార్చానో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఒకే మాటపై నిలబడే వ్యక్తినని రాజు చెప్పారు. వ్యక్తిగత దూషణలు - ఆరోపణలకు దిగేముందు ఒకటికి రెండుసార్లు నిజానిజాలను నిర్ధారించుకోవాలని విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. ఒకరి వ్యక్తిత్వంపై విమర్శలు చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. అచ్చెన్న బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నీతి - నిజాయతీలతో కూడిన రాజకీయాలను మాత్రమే తాను చేస్తానన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అచ్చెన్నకు కాస్తంత ఘాటు డోసే ఇచ్చారు.
Tags:    

Similar News