బాబు కామెంట్‌ కు బీజేపీ వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చేసింది

Update: 2018-03-07 13:40 GMT
ఏపీ అసెంబ్లీ వేదిక‌గా మ‌రోమారు మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ-టీడీపీల మ‌ధ్య మరోమారు మాట‌ల యుద్ధం సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేదిక‌గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగంలో విమ‌ర్వ‌లు గుప్పించ‌డంతో క‌మ‌ళ‌నాథులు సైతం అదే రీతిలో స్పందించారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు... ఏపీకి ఇచ్చిన హామీల నుంచి బీజేపీ నేతలు తప్పించుకోలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పురుడు పోసిన తల్లిని చంపారని అప్పట్లో నరేంద్ర మోడీ అన్నారని కానీ ప్ర‌స్తుతం వాటిని ప్ర‌స్తావించ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాస‌న‌స‌భాఫ‌క్ష నేత‌ విష్ణు కుమార్ రాజు ఘాటుగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తరువాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. హోదాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ప్యాకేజీని ప్రకటించిందని చెప్పారు. రైల్వే జోన్ కూడా త్వరలోనే వస్తుందని అన్నారు. తనకు తెలిసినంత వరకూ పోలవరం బిల్లులేమీ కేంద్రం వద్ద పెండింగ్‌లో లేవని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లుకు విష్ణు కుమార్ రాజు కౌంట‌ర్ ఇచ్చారు. పోలవరం బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారనీ…ఆ వివరాలు తనకు ఇస్తే ఢిల్లీ వెళ్లి వాటిని సాధించుకువస్తానని చెప్పారు. తాను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడినని తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించి పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా చూస్తానని అన్నారు.

అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ బీజేపీలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘హామీలు నెరవేరిస్తే గౌరవిస్తాం.. తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం. మాపై నిందలు వేయడం సరికాదు. మీరు ఢిల్లీ వెళ్లి హోదా సాధించేందుకు ప్రయత్నించండి అంతేకాని మాపై ఎదురుదాడి చేస్తే సహించే ప్రసక్తే లేద’ని బీజేపీ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.
Tags:    

Similar News