జగన్ నిర్ణయానికి భాజపా మద్దతు!

Update: 2017-11-11 01:30 GMT
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని భాజపా ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటే.. తెలుగుదేశం నాయకులకు కన్ను కుట్టినట్టుగా ఉంటుంది. దాన్ని వారు ఏమాత్రం సహించలేరు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. కేంద్రంలోని పెద్దల్ని కలిస్తే.. రకరకాలుగా రంగులు పులిమి విమర్శలు రువ్వే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే హస్తిన భాజపా పెద్దలు తమ కీలక నిర్ణయాల విషయంలో జగన్ కు కూడా స్వయంగా ఫోను చేసి ... ఎంపీల మద్దతు కోరితే.. వారు ఓర్వలేరు. ఇదంతా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా శాసనసభలోని భాజపా నాయకుడు.. సభను బహిష్కరించాలన్న జగన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడితే దానిని వారు జీర్ణం చేసుకోగలరా? కానీ వెలగపూడి అసెంబ్లీలో ఇప్పుడు అదే జరుగుతోంది.

తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయకపోయినందుకు నిరసనగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా శాసనసభను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది నలుగురిలో చర్చ సాగుతోంది. తెదేపా ఈ విషయంలో భుజాలు తడుముకుంటోంది. సాకులు వెతుకుతోంది. అయితే శాసనసభలో భాజపా నాయకులు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇవాళ మాట్లాడారు. అనర్హత విషయంలో నిర్ణయం తీసుకుంటే పోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నడో ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి వచ్చిన ఫిర్యాదులపై స్పీకరు తక్షణ నిర్ణయం తీసుకోవచ్చునని, మహా అయితే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని అక్కడితో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని.. ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్షం సభకు వచ్చి ఉంటే బాగుండేదని కూడా చెప్పారు. మొత్తానికి అనర్హత వేటు వేసే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా నాన్చడం తగదనే విధంగా భాజపా నేత అభిప్రాయం వ్యక్తం చేయడం, ఒక రకంగా జగన్ వైఖరికి సపోర్టుగానే ఉన్నదని పలువురు అంటున్నారు. స్పీకరు ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవడం సభకు మంచిదనే అభిప్రాయం వెలిబుచ్చేలాగా.. తమ మిత్రపక్షం భాజపా మాట్లాడడం తెదేపా నేతలకు నచ్చకపోవచ్చు. మరి వారు ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News