ఆకాశంలో రోడ్ యాక్సిడెంట్ - జ‌స్ట్ మిస్ !

Update: 2018-02-12 10:00 GMT
భూమికి 27 వేల అడుగుల ఎత్తులో రెండు విమానాలు ఎదురెదురుగా ఎదురుప‌డితే? క్ష‌ణాల్లో నిర్ణ‌యం తీసుకోవ‌టంలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా వంద‌లాది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయిన‌ట్లే. అంత‌టి డేంజ‌ర్ ను మ‌హిళా పైలెట్ తీసుకున్న స‌మ‌యోచిత నిర్ణ‌యం కార‌ణంగా పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గ‌త బుధ‌వారం ఆకాశ‌వీధిలో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారం తాజాగా వెలుగు చూసింది.

ఢిల్లీ నుంచి ఫుణెకు వెళుతున్న యూకే 997 విస్తారా విమానం 27 అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తోంది. అదే స‌మ‌యానికి ఎయిరిండియాకు చెందిన విమానం ముంబ‌యి నుంచి భోపాల్ వైపున‌కు ఎయిర్ బ‌స్ ఏ-631 వెళుతోంది. ఈ రెండు విమానాల్లో క‌లిపి మొత్తంగా 261 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఉన్న‌ట్లుండి ఈ రెండు విమానాలు ఒక‌దానికి ఎదురుగా మ‌రొక‌టి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ప్పుడు రెండు విమానాల్ని మ‌హిళా పైలెట్లే న‌డుపుతుండ‌టం గ‌మ‌నార్హం.

విస్తారా విమానాన్ని కోపైలెట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హిళా పైలెట్ న‌డుపుతున్నారు. పైలెట్ ముంద‌స్తు అనుమ‌తి తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ఎయిరిండియా విమానాన్ని కెప్టెన్ అనుప‌మ కోహ్లి న‌డుపుతున్నారు. ఆమెకు ఈ రంగంలో 20 ఏళ్ల అనుభ‌వం ఉంది.  త‌మ విమానానికి విస్తారా విమానం ఎదురుగా రావ‌టాన్ని గుర్తించిన కెప్టెన్ అనుప‌మ‌.. మా విమానానికి ఎదురుగా ఎందుకు వ‌స్తున్నారంటూ ఏటీసీ ద్వారా ప్ర‌శ్నించింది. ఇందుకు స్పందించిన విస్తారా కోపైలెట్‌.. మీరే ఈ మార్గంలో ర‌మ్మ‌న్నారుగా అంటూ బ‌దులిచ్చింది.

విప‌త్క‌ర ప‌రిస్థితిని గుర్తించిన ఎయిరిండియా పైలెట్ అనుప‌మ‌.. మ‌రిక ఆల‌స్యం చేయ‌కుండా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని 27 వేల అడుగుల కంటే ఎత్తున‌కు తీసుకెళ్లింది. దీంతో.. పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పిన‌ట్లైంది. ఈ ఉదంతంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఇద్ద‌రు విస్తారా విమాన పైల‌ట్ల‌ను డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఊహించ‌ని విధంగా ఎదురైన విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేసిన అనుమ‌ప‌ను ఇప్పుడు అంద‌రూ అభినందిస్తున్నారు.
Tags:    

Similar News