అందరి డిమాండ్ ఒకటే అయితే రిజల్టేది?

Update: 2021-04-06 05:40 GMT
రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయం రాజ్యమేలుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్ళు దాటినా ఇంతవరకు వాస్తవాలు బయటకురాలేదు. హత్య చేసిందెవరో ? హత్యకు కారణమేమిటో ? ప్రపంచానికి తెలీలేదు. వివేకా మామూలు వ్యక్తికాదు. దివంగత ముఖ్యమంత్రికి సోదరుడు, స్వయానా ఎంపి, మంత్రి, ఎంఎల్ఏగా చేసిన వ్యక్తి. పైగా జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. ఇంతటి వివిఐపి హత్యకు గురైతే దర్యాప్తు జరుగుతున్న తీరే చాలా విచిత్రంగా ఉంది.

వివేకా కూతురు డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడటంతో రాష్ట్రంలో మళ్ళీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరుగుతున్నది కదా ఇంకేముంది ప్రతిపక్షాలన్నీ జగన్ పై ఆరోపణలతో దాడులను పెంచేస్తున్నాయి. ఒకవైపు బీజేపీ మరోవైపు టీడీపీ పదే పదే జగన్ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే జగన్ తల్లి విజయమ్మ బహిరంగ లేఖపై చర్చలు మొదలయ్యాయి.  

విజయమ్మ రాసిన లేఖలో గమనించాల్సిన విషయం ఏమిటంటే హత్య జరిగింది చంద్రబాబునాయుడు హయాంలో. టీడీపీ ప్రభుత్వంలోనే హత్యపై కొంత దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తు ఏమైందో తెలీదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం హత్యకేసు దర్యాప్తు చేస్తున్నది సీబీఐ. అంటే చంద్రబాబు హయాంలో జరిగిన దర్యాప్తులో ఏమి తేలిందో బయటపటలేదు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఏమి తేలిందో అర్ధం కావటంలేదు.

ఇలాంటి నేపధ్యంలోనే వివేకా హంతకులెవరరో నిగ్గు తేలాల్సిందే అంటు విజయమ్మ డిమాండ్ చేశారు. వివేకా కూతురు సునీత కూడా అదే డిమాండ్ చేశారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మరి అందరి డిమాండ్ ఒకటే అయినపుడు రిజల్టు ఎందుకు కనబడటంలేదు ? అన్నదే అర్ధం కావటంలేదు. దర్యాప్తు అంశాలను బయటపెట్టాల్సిన సిబీఐ ఆపని ఎందుకు చేయటంలేదు ?  ఇదే విషయాన్ని న్యాయస్ధానం కూడా సీబీఐని అడగటంలేదు.

టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ నేతలు, వైసీపీ అధికారంలో ఉన్నపుడు టీడీపీ నేతల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు మాత్రమే వివేకా హత్య ఘటన పనికొస్తోంది. విజయమ్మ లేఖ ప్రకారం హత్య విషయమై దర్యాప్తులో స్పీడు పెంచమని జగన్మోహన్ రెడ్డి కూడా సీబీఐని అడిగారట. అయినా దర్యాప్తు ఏ దశలో ఉందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
Tags:    

Similar News