కాబోయే అల్లుడికి దసరా విందు.. తెలిస్తే నోరురాల్సిందే

Update: 2022-10-07 04:13 GMT
కొత్త అల్లుడ్ని అత్తింటి వారు ఎంత మురిపెంగా చూసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గోదారి జిల్లాల్లోని వారు చేసే విందులకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ.. అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. తాజాగా.. ఉత్తరాంధ్రకు చెందిన అత్తింటి వారు  కాబోయే అల్లుడిని దసరా వేళ పిలిచి.. పెట్టిన విందు వార్తల్లోకి ఎక్కేలా చేసింది. దీనికి కారణం 125 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయటమే.

విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణానికి చెందిన రామక్రిష్ణ.. సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్య. అతగాడికి విశాఖకు చెందిన శ్రీనివాసరావు.. ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికను ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ చేశారు పెద్దలు. వీరి వివాహం వచ్చే ఏడాది మార్చి 9న జరగాల్సి ఉంది. ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తైంది.

ఎంగేజ్ మెంట్ అయ్యాక వచ్చిన పెద్ద పండుగ దసరా కావటంతో అల్లుడ్ని కాబోయే అత్తారింటి వారు విందునకు ఆహ్వానించారు. ఇంటికి వచ్చే అల్లుడ్ని విందుతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వారు భారీగా ప్లాన్ చేశారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 రకాల వంటకాల్ని అతడి ముందు పెట్టి సర్ ప్రైజ్ చేశారు. ఇంత భారీగా ఉన్న మెనూలో కాబోయే అత్తింటి వారు ముప్ఫై రకాలు స్వయంగా వండగా.. మిగిలిన 95 వంటకాల్ని మాత్రం బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చారు.

విందుకు పిలిచి.. టేబుల్ నిండా సర్దేసిన వంటకాలతో కాబోయే అల్లుడికి స్వీట్ షాక్ ఇచ్చారు. ఏం తినాలో అర్థం కాక అతగాడు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు. అన్నింటికి మించి మరో ట్విస్టు ఏమంటే.. సదరు అల్లుడికి తాము పెట్టిన 125 రకాల వంటకాల్లో కొన్నింటి పేర్లు తెలీవని తెలియటంతో ఆశ్చర్యపోవటం వీరి వంతైంది.

ఏమైనా కాబోయే అత్తారింటి వారి ఘనమైన విందునకు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ విందు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News