స్కూల్ తెరుచుడు సరే కానీ.. పెద్దాయన వార్నింగ్ విన్నారా కేసీఆర్?

Update: 2021-06-23 04:18 GMT
వరంగల్ పర్యటన సందర్భంగా స్కూళ్లు మూసుడు.. పిల్లగాళ్లు ఆగమైపోతున్నారన్న మాట చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. స్కూళ్లను వెంటనే తెరిచే ఆలోచనను తన మాటలతో చెప్పకనే చెప్పేశారు. దీనికి తోడు రాష్ట్ర విద్యా శాఖ సైతం.. స్కూళ్లను తెరిచే కార్యక్రమాన్ని షురూ చేయాలని డిసైడ్ అయ్యారు. జులై ఒకటి నుంచి స్కూళ్లను తెరవాలన్న ఆలోచనకు తగ్గట్లు పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఒక పెద్ద మనిషి చేసిన వార్నింగ్ ను వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొవిడ్ పరిస్థితుల్ని క్షుణ్ణంగా అంచనా వేయకుండా స్కూళ్లు తెరవటం ఏ మాత్రం మంచిది కాదన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. ప్రాణాల్ని పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవటం సరికాదని.. పాఠశాల అంటే టీచర్.. హెల్పర్.. విద్యార్థులు ఉంటారని.. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

స్కూళ్లు తెరవటం వైరస్ వ్యాప్తికి అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుందని.. అందువల్ల అత్యుత్తమ రక్షణ ఉన్నప్పుడు మాత్రమే స్కూళ్లు తెరిచే ఆలోచన చేయాలన్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసినప్పుడు కానీ.. వైరస్ చాలావరకు తగ్గిపోయినప్పుడు మాత్రమే అలా చేయటం మంచిదన్నారు.

ప్రస్తుతం వైరస్ తగ్గటం వెనుక.. ప్రజల క్రమశిక్షణతో పాటు.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించటం కూడా కారణమన్నారు. ఇప్పుడు ఆంక్షల్ని ఎత్తేసి.. పాఠశాలల్ని కూడా మొదలు పెడితే వైరస్ కు మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. స్కూళ్లు ఎప్పుడు తెరవాలన్న నిర్ణయంలో రెండుమూడు మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యంఅవుతాయని.. చాలా అప్రమత్తతతో మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాలంటూ వీకే పాల్ చెప్పారు. ఆ పెద్ద మనిషి చెప్పిన మాటల్ని సీఎం కేసీఆర్ జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
Tags:    

Similar News