మొన్నటి వరకు వార్తలు ఇచ్చిన వాంఖడే.. ఇప్పుడు వార్తగా మారాడే

Update: 2021-10-26 15:30 GMT
నిన్నటి వరకు సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వ్యక్తి కాస్తా గడిచిన రెండు.. మూడు రోజులుగా తానే వార్తగా మారిపోయారు. ఇంతకాలం ఆయన కారణంగా సమాధానాలు చెప్పే పరిస్థితుల్లోకి వెళ్లిన వారికి భిన్నంగా ఇప్పుడు ఆయనే సమాదానాలు చెప్పుకోవాల్సిన దుస్థితి. ఆయన్ను వేలెత్తి చూపించే వేళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో.. ఎన్ బీసీ అధికారి సమీర్ వాంఖడే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో పట్టుకోవటం.. జైలుకు పంపంలో సమీర్ వాంఖడే కీలకభూమిక పోషించారని చెప్పాలి. షారుక్ కుమారుడు మాత్రమే కాదు.. పలువురు బడా ప్రముఖుల పిల్లలు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇలాంటివేళ.. సినీ నటి అనన్య కూడా డ్రగ్స్ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీనికి కూడా సమీర్ వాంఖడేనే కారణం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎంతకూ కొరుకుడుపడని సమీర్ వాంఖడే మీద ఎదురుదాడి మూడు రోజుల క్రితం మొదలైంది.

ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టటానికి రూ.25 కోట్ల డిమాండ్ చేశారని.. అందులో సమీర్ వాంఖడేకు రూ8 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్న ఆరోపణలతో మొదలైన రచ్చ .. గంటలు తిరిగేసరికి పలు ఆరోపణలు ఆయన మీద వెల్లువెత్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఆయన తన మీద వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సి వస్తోంది. తాజాగా ఆయన సతీమణి కూడా సీన్లోకి వచ్చేశారు. దీనికి కారణం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తున్న ఆరోపణలే.

సమీర్ మతం గురించి.. తల్లి.. భార్య గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సమీర్ సతీమణి మాజీ నటి క్రాంతి రాడ్కేర్ ఫైర్ అయ్యారు. సమీర్ నిజాయితీపరుడైన అధికారని.. అందుకే ఆయనకు శత్రువులు ఎక్కువన్నారు. ప్రస్తుతం తన భర్తకు ప్రాణహాని పొంచి ఉందన్నారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని.. ఆయనపై దాడిని ఉపేక్షించేది లేదన్నారు.

సమీర్ వాంఖడే అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని.. తప్పుడు సర్టిఫికేట్ తో ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు రావటంతో అతని పేరు దావూద్ కాదని.. ధన్యదేవ్ అని సమీర్ తండ్రి స్పష్టం చేశారు.తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించినట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరిన్ని ఆరోపణలు చేస్తున్నారు.

అందులో ముఖ్యమైనది ముంబయి..ఠాణెల్లోని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ప్రముఖ వ్యక్తులు.. బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సమాచారం అందినట్లు పేర్కొన్నారు. వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారంటున్నారు. దీనికి సంబంధించిన లేఖ ఒకటి తనకు వచ్చిందంటూ.. ఆయన ఆ లేఖను ట్విటర్ లో పోస్టు చేశారు. అంతేకాదు.. ఆ లేఖను తాను ముఖ్యమంత్రి.. డీజీ కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు.

మంత్రి నవాజ్ మాలిక్ షేర్ చేసిన లేఖను సమీర్ వాంఖడే ఖండించారు. ఆ లెటర్ పెద్ద జోక్ అని తేల్చారు. అందులో ఉన్నదంతా తప్పుడు సమాచారంగా పేర్కొన్నారు. మాలిక్ తనపై ఎన్ని ఆరోపణలైనా చేసుకోవచ్చని ఆయనకు ఆ స్వేచ్ఛ ఉందన్నారు. మొత్తంగా చూస్తే గడిచిన మూడు నాలుగు రోజులుగా.. సమీర్ మీద రోజుకొక కొత్త ఆరోపణ రావటం.. ఒత్తిడితో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసే కార్యక్రమం మొదలైందన్న మాట వినిపిస్తోంది.




Tags:    

Similar News