ఏంజరుగుతోంది?: వంశీ వ‌ర్సెస్ ఉమా

Update: 2016-02-15 08:04 GMT
ఇన్న‌ర్‌ రోడ్డు ఇంట్లో వార్‌ కు దారితీస్తోంది. తెలుగుదేశం స‌భ్యులంతా ఒకే కుటుంబ స‌భ్యులుగా భావించి క‌లిసిమెల‌సి ఉండాల‌ని చెప్పే పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మాట ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. అభివృద్ధి కోసం ప్ర‌తిపాదించిన అంత‌ర్గ‌త రోడ్డు అన్న‌గారి పార్టీలో ముస‌లానికి దారితీస్తోంది. ఇదంతా ఏపీ ప్ర‌భుత్వ తాత్కాలిక ప‌రిపాల‌న రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో జ‌రుగుతోంది. సీనియ‌ర్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావుకు, పార్టీకే చెందిన కీల‌క ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌ కు మ‌ద్య ఈ వివాదం ముదురుతోంది.

విష‌యంలో లోతుల్లోకి వెళితే గన్న‌వ‌రం నుంచి గత ఎన్నికల్లో బ‌రిలో నిలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ తనను గెలిపిస్తే వంతెన నిర్మిస్తానంటూ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే రామవరప్పాడు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయ‌నకు అత్యధిక మెజార్టీ రామవరప్పాడు వాసులు క‌ట్ట‌బెట్టారు. ఇచ్చిన హామీని నిలుపుకునేందుకుకు ఎంపీ కొనకళ్ల నారాయణతో కలిసి వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లను ఎమ్మెల్యే వంశీ మంజూరు చేయించారు. అయితే అది నెరవేరే క్ర‌మంలో కొన్ని అడ్డంకులు ఎదుర‌వుతుండ‌గా... హామీ నెర‌వేరితే వంశీకి మైలేజీ వ‌స్తుంద‌నే భావ‌న‌తో కావాల‌నే కొంద‌రు అడ్డుపడుతున్నారని వంశీ వర్గం భావిస్తోంది.

రామ‌వ‌ర‌ప్పాడు స‌మీపంలోనే ఉన్న రైవస్ కాల్వపై వంతెన కడితే భవిష్యత్తులో మెట్రో రైలు నిర్మాణానికి ఇబ్బంది వస్తుందంటూ ఇరిగేషన్ అధికారులు దీనికి అనుమతులు ఇవ్వడం లేక‌పోవ‌డంతో ఈ అసంతృప్తి కాస్త మంత్రి దేవినేని ఉమా వ‌ర్సెస్ వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్న‌ట్లుగా ప్రారంభ‌మైంది. ఇన్న‌ర్ రింగ్‌ రోడ్ నిర్మాణం గ‌తంలో ప్ర‌తిపాద‌న‌కు రాగా..పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే ఇన్నర్ రింగ్ రోడ్‌ కోసం ఇళ్లు తొలగిస్తానని గతంలో కలెక్టర్ హామీ ఇచ్చారు. అయిన‌ప్పటికీ తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పేదల ఇళ్లను తీసుకునేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు ముందుకు రావ‌డం హీట్‌ను మ‌రింత పెంచింది. ఈ క్ర‌మంలో వంశీ త‌న ప్ర‌జ‌ల కోసం ముందుకు వ‌చ్చారు. రాస్తారోకో చేస్తున్న‌ స్థానికుల‌తో క‌లిసి ఆకస్మికంగా ఇళ్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడం ఏంట‌ని అధికారులను వంశీ ప్రశ్నించారు. ఈక్ర‌మంలో వంశీ స‌హా స్థానికుల‌పై కేసులు న‌మోద‌య్యాయి.

వ‌రుస‌గా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల వెనుక మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావు హ‌స్తం ఉండ‌వ‌చ్చ‌ని వంశీ వ‌ర్గీయులు భావిస్తున్నారు. గ‌తంలో పోలవరం కుడికాల్వ నుంచి దెందులూరు, మైలవరం నియోజకవర్గాల రైతులు మోటార్లు ఉపయోగించి నీరు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న నియోజకవర్గంలోని గన్నవరం  రైతుల పంటలను కాపాడేందుకు వంశీ కూడా అదే కాల్వకు మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ ప‌రిణామాల‌తో గన్నవరం రైతుల్లో త‌మ నాయ‌కుడికి బలం పెరుగుతోందని భావించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇరిగేషన్ అధికారులను ఉపయోగించి ఆయా మోటార్లను తొలగించేందుకు ప్రయత్నించారని వంశీవ‌ర్గం ఆరోపిస్తోంది. తాజాగా రామవరప్పాడులో ఇళ్లు కూల్చివేయ‌డానికి నోటీసులు ఇవ్వ‌డం కూడా ప్రజల్లో వంశీని పలచన చేయడానికే జ‌రిగింద‌ని, గ‌త ప‌రిణామాల‌తో స‌హా ప్ర‌స్తుత రోడ్డు ప్ర‌తిపాద‌న‌ల వెనుక మంత్రి ఉమా హస్తం ఉండవచ్చని వంశీ వర్గం భావిస్తోంది.

మ‌రోవైపు పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం, వంశీతో పాటు మ‌రో 200 మందిపై ఈ కేసులు పెట్ట‌డం కూడా ఏదో జ‌రుగుతోంద‌నే భావ‌న‌ను క‌లిగిస్తున్నాయి. మొత్తంగా ఇపుడు విజ‌య‌వాడ కేంద్రంగా ఏపీ ప‌రిపాల‌న ఒక్క‌టే సాగ‌డం లేదు. రాజ‌కీయాలు, అంత‌ర్గ‌త అల‌జ‌డులు కూడా బెజ‌వాడ కేంద్రంగా సాగుతున్నాయి.
Tags:    

Similar News