తిరుపతిలో వార్ వన్ సైడేనా ?

Update: 2021-04-15 04:30 GMT
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వార్ వన్ సైడేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈనెల 17వ తేదీన జరగబోయే ఉపఎన్నిక పోలింగ్ ఆంధ్రా ఫ్యాక్ట్ చెక్ (ఏఎఫ్సీ) ప్రీపోల్ సర్వే చేసింది. దాని ప్రకారం వైసీపీకి 70 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. టీడీపీకి 19.68 శాతం మాత్రమే ఓట్లు పోలవుతాయని చెప్పింది. ఇక బీజేపీ+జనసేన మిత్రపక్షాల అభ్యర్ధికి 7.13 శాతం ఓట్లో పోలవుతాయట. కాంగ్రెస్, అదర్స్ గురించి చెప్పుకోవటానికేమీ పెద్దగా లేదని తమ సర్వేలో తేలిందని ఫ్యాక్ట్ చెక్ చెప్పింది.

లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1993 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఏఎఫ్సీ సర్వేచేసింది 700 పోలింగ్ కేంద్రాల్లో. 7 వేల శాంపుల్స్ తీసుకున్నదట. ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 మధ్య సర్వే చేసినట్లు ట్విట్టర్ లో ప్రకటించింది. తమ సంస్ధ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో పోటీ ఏకపక్షంగా ఉంటుందని తేలినట్లు ఫ్యాక్ట్ చెక్ నిర్వాహకులు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు పార్టీ అభ్యర్ధికి చాలా బలంగా మద్దతుగా నిలబడుతున్నట్లు తేలిందట.

సర్వేలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనే అంచనాను కూడా ప్రకటించారు. అంటే ఆ వివరాలన్నింటినీ క్లుప్తంగా చెప్పాలంటే సర్వే ప్రకారం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరిలో వైసీపీకి అనుకూలంగా 70 శాతం దాటి పోలింగ్ జరుగుతుంది. అలాగే తిరుపతి, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, సత్యేవేడులో సగటున 70 శాతం ఓట్లో పోలవుతాయట.

అలాగే తెలుగుదేశంపార్టీకి అత్యధికంగా శ్రీకాళహస్తిలో 24.03 శాతం ఓట్లు పోలవుతాయని తేల్చింది. గూడూరు, సూళ్ళూరుపేటలో 22 శాతం ఓట్లు పడతాయట. తిరుపతిలో మరీ అన్యాయంగా 14 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలినట్లు చెప్పింది. ఇదే సందర్భంగా బీజేపీ అభ్యర్ధికి అత్యధికంగా తిరుపతిలో మాత్రమే అంటే 12 శాతం ఓట్లొస్తాయట. అంటే టీడీపీకి తిరుపతిలో 14 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 2 శాతం తక్కువగా 12 శాతం వస్తాయట.

మొత్తానికి ఆంధ్రా ఫ్యాక్ట్ చెక్ ప్రీ పోల్ సర్వే పేరుతో రిలీజ్ చేసిన ఫలితాలు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారాయి. నిజానికి ప్రీపోల్ సర్వేలు, సర్వే ఫలితాలలన్నీ నూరుశాతం వాస్తవం అనేందుకు లేదు. ఎందుకంటే కొన్నిసార్లు సర్వే ఫలితాలు తప్పుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే జననాడి ఎలాగుంది అనేందుకు ఓ బ్రాడ్ అవుట్ లుక్ కోసం మాత్రమే పనికొస్తుంది. మరి ఏఎఫ్సీ ప్రీపోల్ సర్వే సంగతేమిటో తేలాలంటే మే 2వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News