ఉత్తరకొరియా రథసారథి కిమ్ తో భేటీ అవడం ద్వారా శాంతి మంత్రం జపించడమే కాకుండా..దూకుడు మంత్రానికి దూరమయ్యారనే సంకేతాన్ని పంపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అసలు శైలి ఇంకా అలాగే ఉందని నిరూపించుకున్నారు. కీలక సమావేశానికి ముందే... భారత్‌పై బెదిరింపులకు దిగాడు. సోమవారం జరిగిన జీ-7 దేశాధినేతల సంయుక్త ప్రకటన నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ భారత్ పై విమర్శలు చేశారు. అందరూ తమను దోచుకునేందుకు చూస్తున్నారని... తామేమైనా పిగ్గీ బ్యాంక్ లమా అంటూ విరుచుకుపడ్డారు.
అమెరికా ఔషధాలు - వైద్య పరికరాల ధరలను ప్రపంచ దేశాలు తమ ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని ఆయన ఆరోపిస్తూ.. ఇటువంటి దేశాలకు అభ్యంతరాలను తెలియజేయాల్సిందిగా అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్ టీఆర్)ని కొద్దికాలం క్రితం ట్రంప్ ఆదేశించారు. అమెరికాలోని పరిశోధన - అభివృద్ధి సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఇతర దేశాలు ఈ ధరలను నిర్ణయించడం ఏమాత్రం సమర్ధనీయం కాదని - ఇటువంటి ధోరణిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తమ దేశంలో ఔషధాల ధరలను తగ్గించేందుకు విధానపరంగా ట్రంప్ చేపడుతున్న కొత్త చర్యలు అమెరికా - భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. అత్యంత ఖరీదైన ఔషధాలు - వైద్య పరికరాల ధరలను స్వయంగా తామే నిర్ణయించాలని భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఔషధ పరిశ్రమ ఇప్పటికే వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఇదే పరిణామంపై ఘాటుగా స్పందించారు. `ఒకే ప్లాంట్ లో తయారై ఒకే ప్యాకేజీతో మార్కెట్లోకి వచ్చిన ఒకేవిధమైన మందులను విదేశాల్లో చాలా తక్కువ ధరకు అమ్ముతుంటే.. అవే మందులు అమెరికాలో వందలాది డాలర్ల ధర పలుకుతుండటం చాలా హాస్యాస్పదం - అన్యాయం. ఏవిధంగానూ ఇది ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి ధోరణిని ఇక ఎంతమాత్రం సహించేది లేదు అని ట్రంప్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్యానికి శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందని, ఔషధ ధరల విషయంలో ప్రతి భాగస్వామ్య దేశానికి అభ్యంతరాన్ని తెలియజేసి ఇకమీదట అమెరికాకు అన్యాయం జరుగకుండా నివారించాల్సిందిగా తమ వాణిజ్య ప్రతినిధి బాబ్ లైట్ హైజర్ ను ఆదేశించానని ట్రంప్ తెలిపారు. ‘భారత్‌లో మా వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారు.