బాలీవుడ్ పై గంభీర్ మార్కు ఫైర్

Update: 2016-10-18 13:23 GMT
ఉడీ ఉగ్రవాద దాడి, పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడుల అనంతరం పాక్ నటీనటులపై బాలీవుడ్ నిర్మాతల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే పాక్ నటులు నటించిన సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిషేధం విధించారు. అయితే ఈ ఈ చర్యలను తప్పుపడుతూ - పాక్ నటులకు మద్దతుగా కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుతున్నా నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు. స్పందించడం అంటే అలా ఇలా కాదు బాలీవుడ్ సెలబ్రెటీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పాకిస్థాన్ నటీనటులకు మద్దతుగా మాట్లాడుతున్న వారంతా, ఆ దేశం కారణంగా తమ కుటుంబ సభ్యులు మరణించినా కూడా ఇలాగే మాట్లాడతారా అని గంభీర్ ప్రశ్నించాడు.

బ్యాట్ పట్టి మైదానంలో దిగిన తర్వాత బౌలర్లపైనా - స్లెడ్జింగ్ కి పాల్పడే క్రికెటర్లపైనా తనదైన స్టైల్లో విరుచుకుపడే గంభీర్... బాలీవుడ్ సెలెబ్రిటీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బాలీవుడ్ ప్రముఖులు కొంతమంది పాకిస్థాన్ నటీనటులకు మద్దతు ఇవ్వడాన్ని గౌతం తప్పుపట్టాడు. ఆ దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేవరకు వారితో క్రికెట్ లేదా బాలీవుడ్ కు సంబంధించి ఎలాంటి సంబంధాలనూ భారత్ పెట్టుకోరాదని సూచించాడు. వాణిజ్య ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమని అభిప్రాయపడిన గౌతం... క్రికెట్ ను, సినిమాలను జాతీయ మనోభావాలకు భిన్నంగా చూడాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు చెప్పడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పాడు.

ఇదే సందర్భంలో మరింతగా చురకలంటిచిన గౌతం... ఏసీ గదుల్లో కూర్చుని సినిమాలను - క్రికెట్ ను రాజకీయాలతో ముడిపెట్టరాదని ప్రకటనలు ఇవ్వడం తగదని, అన్నిటికంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికాడు. ఇంత జరిగినా కూడా పాకిస్థాన్ నటులకు మద్దతు పలుకుతున్న వారంతా... ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ తర్వాత ఈ విషయంపై సమాధానం చెప్పాలని సూచించాడు. ఈ రేంజ్ లో గౌతం గంభీర్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News