బ్యాడ్ న్యూస్.. వ్యాక్సిన్ పై డబ్ల్యూహెచ్ కీలక ప్రకటన

Update: 2020-07-23 06:45 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120కు పైగా ప్రయోగాలు సాగుతున్నా.. రెండు.. మూడు ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇవ్వటం.. వాటి మీదే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో.. అదెప్పుడు విడుదల అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో పలు అంచనాలు వెల్లడవుతున్నాయి.

కొందరు ఈ ఏడాది అక్టోబరు నాటికే వ్యాక్సిన్ వచ్చేస్తుందంటే.. మరికొందరు మాత్రం డిసెంబరుకు తప్పక వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి అంచనాలకు చెక్ చెబుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. 2021 కంటే ముందు పూర్తిస్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అంతేకాదు.. వ్యాక్సిన్ పంపిణీలోనూ ఎలాంటి వివక్ష ఉండబోదని వెల్లడించింది. వ్యాక్సిన్ వచ్చినంతనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నది సంపద కోసమో.. కేవలం పేదల కోసమో కాదని.. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని డబ్ల్యూహెచ్ అత్యవసర విభాగం అధిపతి మైక్ ర్యాన్ పేర్కొన్నారు.

వివిధ వ్యాక్సిన్లు పలు దశల్లో ఉన్నాయని.. కొన్ని మూడో దశకు చేరుకున్నాయని చెప్పారు. సంతోషించే అంశం ఏమంటే.. కీలక దశల్లో ఉన్న ఏ ప్రయోగం విఫలం కాలేదన్నారు. అయితే.. వ్యాక్సిన్ ఏదీ 2021కు ముందు మాత్రం వచ్చే వీలు లేదన్నారు. ఫిజర్.. జర్మన్ బయోటెక్.. లాంటి సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్ సేఫ్ అని నిరూపిస్తే తాము 1.95 బిలియన్ డాలర్లు వెచ్చించి 100 మిలియన్ డోసులు కొనుగోలు చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో డబ్ల్యూ హెచ్ చేసిన ప్రకటన కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే.. 2020 సంవత్సరం ప్రపంచానికి డబుల్ జీరోల్ని మిగిల్చిందని చెప్పక తప్పదు. పరిస్థితుల్లో మార్పు కోసం 2021 వరకూ వెయిట్ చేయక తప్పదన్న మాట.
Tags:    

Similar News