కోహ్లీ నుంచి ద్రావిడ్ కోరుకునేదేమిటి?

Update: 2021-12-26 11:30 GMT
టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వస్తూనే పరిస్థితులన్నీ మారిపోయాయి. కోహ్లి.. రాహుల్ కోచ్ గా ఖాయం అవుతూనే టి20 పగ్గాలను వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. మరోవైపు సెలక్టర్లే కోహ్లి వన్డే కెప్టెన్సీని తొలగించారు. అటు కోచ్ గా ద్రవిడ్.. ఇటు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ. వీరి మధ్యలో ఫామ్ కోల్పోయిన కోహ్లి. ఏం జరిగినా చూస్తూండిపోవాల్సిందే. తలెగరేస్తే.. టెస్టు కెప్టెన్సీకీ ముప్పు తప్పదని కోహ్లికి తెలుసు. అసలు రోహిత్ శర్మ గనుక టెస్టుల్లో మరింత పుంజుకొంటే కోహ్లి టెస్టు కెప్టెన్సీకి దినదిన గండమే. అయితే, ఈ నేపథ్యంలోనే టీమిండియా దక్షిణాఫ్రికా సిరీస్ కు పయనమైంది. ఒమైక్రాన్ భయాలున్నా సిరీస్ ప్రారంభమైంది.

ఈసారైనా ఒడిసి పట్టాలని ముప్పై ఏళ్ల (1992) నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఇరు దేశాల్లో చెరో ఏడేసి సార్లు పర్యటించాయి. మొత్తం 39 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో 20 టెస్టులు దక్షిణాఫ్రికాలో.. మరో 19 టెస్టులు భారత్‌లో జరిగాయి. స్వదేశంలో టీమ్‌ఇండియా ఎంత పటిష్ఠమైన జట్టో మనందరికీ తెలుసు. కానీ 19 టెస్టుల్లో భారత్ పదకొండు, దక్షిణాఫ్రికా ఐదు గెలుచుకోగా.. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇందులో ఒక సిరీస్‌నూ ప్రొటీస్ జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయితే దక్షిణాఫ్రికా వారి దేశంలో మాత్రం టీమ్‌ఇండియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆఫ్రికా నేల మీద భారత్‌ ఒక్క సిరీసూ నెగ్గలేదు. ఇరవై టెస్టుల్లో పదింట్లో దక్షిణాఫ్రికా గెలవగా.. కేవలం మూడే మ్యాచుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. మరో ఏడు టెస్టులను డ్రా చేసుకుంది. చివరి సారిగా భారత్‌ 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. మూడు టెస్టులను ఆడింది. అయితే దక్షిణాఫ్రికా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ వెళ్తున్న టీమ్‌ఇండియా సరిగ్గా మూడు టెస్టులనే ఆడనుంది. ఈసారైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ద్రావిడ్ కాంక్షించేది కూడా ఇదే..

దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ కోహ్లీ నుంచి తాను ఒక గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నానని ద్రావిడ్ అన్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడే కాకుండా, గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చారు. టెస్టుల్లో మన జట్టు పురోగతిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని చెప్పారు. జట్టు పురోగతిలో కోహ్లీ పోషించిన పాత్ర గొప్పదన్నారు. టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడని చెప్పారు. ఈ టెస్ట్ సిరీస్‌లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తనకుందని అన్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ తొలగించిన తర్వాత వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై ద్రావిడ్ ప్రశంసలు కురిపించడం గమనార్హం. కెప్టెన్‌ను ఎంపిక చేయడం లేదా తప్పించడం అనేది సెలెక్టర్ల బాధ్యత అని ద్రావిడ్ అన్నారు. ఈ విషయంలోకి తాను పోదలుచుకోలేదని చెప్పారు.


Tags:    

Similar News