తెలుగు సీఎంలకు ఏమైంది? ఫ్రీ మాటెందుకు చెప్పట్లేదు?

Update: 2020-12-13 05:49 GMT
దేశంలో ఇంత మంది ముఖ్యమంత్రులు ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు కాస్త భిన్నం. భయపెట్టే ఆర్థిక సమస్యలు వెంటాడి.. వేధిస్తున్నా.. వాటి కారణంగా సంక్షేమ పథకాల్ని నిలిపివేయటానికి ససేమిరా అనే వారు.. ఒక విషయంలో మాత్రం తమ తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న పేరుంది. ఏదైనా పథకం ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందంటే.. కష్టాల్ని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకునే గొప్ప వ్యక్తిత్వం వారిది.

అలాంటివారు.. దేశంలోని ముగ్గురు ముఖ్యమంత్రులతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేలిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకూ ఏ విషయంలో అంటారా? అక్కడికే వస్తున్నాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చే డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. వచ్చే జనవరి 15 నుంచి పంపిణీని మొదలు పెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే మధ్యప్రదేశ్.. తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ ను తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. తాజాగా ఈ జాబితాలో కేరళ కూడా వచ్చి చేరింది. ఒక్కో రాష్ట్రం.. తన రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పి సంచలనంగా వ్యవహరిస్తుంటే.. అందుకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నోటి నుంచి వ్యాక్సిన్ వ్యవహారంపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవటం గమనార్హం. వరాల దేవుళ్లగా పేరున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని ఏ రీతిలో నిర్వహిస్తామన్న అంశంపై క్లారిటీ చాలా అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News